Share News

చెరువులో నుంచి చేలోకి..

ABN , Publish Date - Oct 28 , 2026 | 02:11 AM

చేతిలో అధికారం లేకపోయినా.. వైసీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. గ్రామస్థులు అభ్యంతరం చెప్పినా స్పందన లేదు. పొదిలి మండ లంలోని ఓబులక్కపల్లిలో జరిగిన నిర్వాకమే ఇందుకు నిదర్శనం.

చెరువులో నుంచి చేలోకి..
ఓబులక్కపల్లి చెరువులో అనధికారికంగా నిర్మించిన రహదారి

అక్రమంగా రహదారి నిర్మాణం

సొంత పొలంలోకి వెళ్లేలా కిలోమీటరు దూరం రోడ్డు ఏర్పాటు

ఓబులక్కపల్లిలో వైసీపీ నాయకుడి నిర్వాకం

గ్రామస్థుల ఫిర్యాదును పట్టించుకోని అధికారులు

పొదిలి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : చేతిలో అధికారం లేకపోయినా.. వైసీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. గ్రామస్థులు అభ్యంతరం చెప్పినా స్పందన లేదు. పొదిలి మండ లంలోని ఓబులక్కపల్లిలో జరిగిన నిర్వాకమే ఇందుకు నిదర్శనం. వైసీపీ నేత ఒకరు తన భూమిలోకి వెళ్లేందుకు ఓ చెరువులో నుంచి ఏకంగా కిలోమీటరు దూరం రహదారిని నిర్మించుకుని దర్జాగా తిరుగుతున్నాడు. చెరువులో ఇష్టారీతిన మట్టిన తవ్వి రోడ్డుకు వినియోగించాడు. ఇంత జరిగినా అధికారులు ఆవైపు చూడకపోవడం గమనార్హం. మండలంలోని ఓబులక్కపల్లి గ్రామంలో 76-1, 76-2 సర్వే నెంబర్లలో 55.35 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. అందు లోకి నీరు చేరితే 60 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయింది. ఆ చెరువుకు ఆనుకుని వైసీపీకి చెందిన ఓ నాయకుడి పొలం ఉంది. ఆయన చెరువులో నుంచి అనధికారికంగా తన పొలం వరకు రహదారి ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు కిలోమీటరు పొడవును ఈ రహదారి సిద్ధం చేసుకున్నాడు. ఇందుకు అవసరమైన మట్టిని కూడా చెరువు నుంచి తవ్వి కిలోమీటరు పొడవునా రోడ్డు వేయించాడు. రహదారి పక్కన పెద్దపెద్ద గుంతలు తీయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని అడిగితే పొంతనలేని సమాదానం చెబుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. కిలోమీటరు చెరువుతొట్టిలో, ఇరువైపులా మట్టితీసి రహదారి వేస్తుంటే అధికారులు తెలిసి కూడా ఏమీ ఎరుగనట్టు విమర్శిస్తున్నారు. గుంతలు తీయడం వల్ల వర్షపునీరు చెరువులోకి చేరదని, దీనివల్ల గేదెలు, గొర్రెలు, మేకలకు నీటి సమస్య వస్తుందని చెబుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

రహదారి వేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. రెవెన్యూ తహసీల్దార్‌ వద్ద సర్వే రిపోర్టు తీసుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటాం

- నవీన్‌ కుమార్‌, ఏఈ

Updated Date - Oct 28 , 2026 | 02:11 AM