Share News

ఇకపై మీభూమి మీ హక్కు

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:59 PM

ఇకపై భూ యజమానులకు సంబంధించిన పాసుపుస్తకాలపై రాజముద్ర ఉంటుందని, ‘మీభూమి మీ హక్కు’ అని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు.

ఇకపై మీభూమి మీ హక్కు
ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య

చీరాల, జనవరి2 (ఆంధ్రజ్యోతి) : ఇకపై భూ యజమానులకు సంబంధించిన పాసుపుస్తకాలపై రాజముద్ర ఉంటుందని, ‘మీభూమి మీ హక్కు’ అని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలపై నాటి సీఎం జగన్‌రెడ్డి తన ఫోటోలను ముద్రించుకున్నారన్నారు. దీంతో అప్పట్లోనే ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయన్నారు. ఈక్రమంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు పాసు పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉంచి పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఈక్రమంలోనే ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని ఉజిలీపేట సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా రాజుమద్రతో కూడిన నూతన పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రీసర్వే జరిగిన ప్రాంతాల్లో ప్రజలకు పారదర్శకంగా పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 9లోగా పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేటి నుంచి భూహక్కు పత్రాలు పంపిణీ

చినగంజాం : మండల పరిధిలో గతంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈ నెల 3వ తేది నుండి 7వ తేది వరకు రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్‌ జీవిగుంట ప్రభాకరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3న గొనసపూడి, 6న చింతగుంపల్లె, 7న కడవకుదురు గ్రామాల్లో భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఉదయం 11 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత రైతులందరూ హాజరై భూహక్కు పత్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భూ హక్కు పత్రాలలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే సదరు సమస్యలు ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో తగు రికార్డులు, ఽఆధారాలను జతపరచి ఆర్జీలు ఇచ్చి సదరు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ

మార్టూరు : మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో శుక్రవారం ఆర్‌డీవో గ్లోరియా చేతుల మీదగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. గతంలో రీసర్వే పూర్తయిన గ్రామమైన బొ ల్లాపల్లి గ్రామంలో పాస్‌పుస్తకాలు పంపిణీ కోసం గ్రామసభను ఏర్పాటుచేశారు. ఈ సభ లో ఆర్‌డీవో గ్లోరియా పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలోని కొంతమందికి ఆమె పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాలలో రీసర్వే పూర్తయిన గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరయ్యాయని తహసీల్దార్‌ టి.ప్రశాంతి అన్నారు. కార్యక్రమంలో నాయకులు ముద్దన హనుమంతరావు, వజ్జా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

యద్దనపూడిలో

యద్దనపూడి మండలంలోని యద్దనపూడి తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. మండలంలోని వింజనంపాడు, జాగర్లమూడి, గన్నవరం గ్రామాలకు చెందిన వారికి పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు కె రవికుమార్‌, నాయకులు కనపర్తి నాగేశ్వరరావు, నల్లపనేని రంగయ్యచౌదరి, సాదినేని రంగారావు, సాదినేని సుధీర్‌, రావిపాటి సీతయ్య, గుదే తారక రామారావు, సర్పంచ్‌ వలేరు రేణుక బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 09:59 PM