Share News

కొర్పొరేట్‌ నుంచి ప్రభుత్వ బడికి..

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:38 PM

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య, నాణ్యమైన వసతులు, విద్య అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న విప్లవాత్మక మార్పులకు తోడు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామాల ప్రజలు సమన్వయంతో ముందడుగేస్తే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు ధీటుగా తయారవుతాయని నిరూపించారు జరుగుమల్లి మండలంలోని పచ్చవ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయులు, పచ్చవ గ్రామస్తులు.

కొర్పొరేట్‌ నుంచి ప్రభుత్వ బడికి..
పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు

ఆదర్శంగా పచ్చవ మోడల్‌ ప్రైమరీ పాఠశాల

ఉపాధ్యాయుల, గ్రామస్థుల సమన్వయంతో పెరిగిన విద్యార్థులు

గత ఏడాది 53.. ఇప్పుడు 75 మంది

సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు

భవన వసతులు కల్పిస్తే మరింత అభివృద్ధి

పచ్చవ(కొండపి), జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య, నాణ్యమైన వసతులు, విద్య అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న విప్లవాత్మక మార్పులకు తోడు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామాల ప్రజలు సమన్వయంతో ముందడుగేస్తే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు ధీటుగా తయారవుతాయని నిరూపించారు జరుగుమల్లి మండలంలోని పచ్చవ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయులు, పచ్చవ గ్రామస్తులు.

పెరిగిన విద్యార్థులు

గడిచిన ఏడాది ఈస్కూల్‌లో 1నుంచి 5వ తరగతి వరకు 53 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఐదో తరగతి చదివిన 14 మంది విద్యార్థులు 6వ తరగతికి గ్రామంలోని జడ్పీస్కూల్‌కు వెళ్లారు. దీంతో 39 మంది మాత్రమే మిగిలారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి గ్రామం నుంచి డబ్బుల బడులకు (ప్రైవేటు స్కూల్స్‌కు) వెళ్లేవారిని నిలువరించడంలో విశేష కృషి చేసి విజయం సాధించారు. అలా 13 మందిని నిలువరించారు. అంతేగాక వారంతట వారుగా మరికొందరు చేరారు. దీంతో ఈ ఏడాది విద్యార్థుల శాతం గణనీయంగా పెరిగింది. మొత్తం 75 మంది ఎన్‌రోల్‌ అయ్యారు. 1వ తరగతి 17 మంది, 2వ తరగతి 17 మంది, 3వ తరగతి 18 మంది, 4వ తరగతి 11 మంది, 5వ తరగతి 12 మంది ఉన్నారు. స్కూల్‌ భవనాలు పురానతమైనవి కావడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. అదనంగా కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది.


గ్రామస్తుల కృషి

స్కూల్‌లో హెచ్‌ఎం కల్యాణితోపాటు జి. మాలకొండయ్య, బి. రాఘవమ్మ, జి. శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా త్వరలోనే మరో ఉపాధ్యాయుడుగాని, ప్రత్యేక బోధకుడు గాని వచ్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల కృషికి తోడు గ్రామస్థులను సమన్వయం చేసుకుంటూ హెచ్‌ఎం మందుకు వెళుతున్నారు. ఎప్పటికపుడు విద్యార్థుల పఠనా సామర్థ్యాలను తల్లితండ్రులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. గ్రామానికి చెందిన దాతలు సరస్వతీ విగ్రహం, విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు తోడు చదువుకోవడానికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారు. స్కూల్‌కు కుర్చీలు, ఇతర వసతులను సమకూరుస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:38 PM