ఉచితంగా బయోమెట్రిక్ అప్‌డేట్
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:48 AM
జిల్లాలో కాలేజీలు, పాఠ శాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే.
ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లు, కాలేజీలపై ప్రత్యేక దృష్టి
ఇంకా 39వేల మందికిపైగా పిల్లలు ఉన్నట్లు అంచనా
21 నుంచి కార్యక్రమం ప్రారంభం
42 ప్రత్యేక ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కాలేజీలు, పాఠ శాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే చిన్న వయసులో ఆధార్ నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కొందరికి బయోమెట్రిక్ పడటం లేదు. దీంతో అటువంటి విద్యార్థులందరి బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసే దిశగా చర్యలు చేపట్టింది. స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఈ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వేలిముద్రలను అప్‌డేట్ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 61,778 మంది ఆధార్ బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు 22,118 మంది మాత్రమే చేయించుకున్నారు. ఇంకా 39,660మంది విద్యార్థులు పెండింగ్‌లో ఉన్నారు.
42 ప్రత్యేక ఆధార్ కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా కాలేజీలు, పాఠశాలల్లో 42 ప్రత్యేక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి బయోమెట్రిక్ చేసే ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. దీన్ని ఈ నెలలో రెండు విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అయితే కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో మొదటి విడత మంగళవారం నుంచి జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. 5 నుంచి 15ఏళ్ల లోపు విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేస్తారు. 15 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు రూ.25 చెల్లించి బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఎక్కువమంది ఉండే కాలేజీలు, పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రిన్సిపాల్స్. ప్రధానోపాధ్యాయుల సహకారంతో ప్రక్రియను చేపట్టనున్నారు.