Share News

ఆశలు చూపి మోసాలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 02:52 AM

దర్శి ప్రాంతంలో మాయగాళ్లు రోజుకోరకంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. రకరకాల ఆశలు చూపి సొమ్ము కొల్లగొడుతున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

ఆశలు చూపి మోసాలు

అధిక వడ్డీలు ఇస్తామని దగా

ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని టోకరా

దర్శి ప్రాంతంలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు

లబోదిబోమంటున్న బాధితులు

దర్శి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : దర్శి ప్రాంతంలో మాయగాళ్లు రోజుకోరకంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. రకరకాల ఆశలు చూపి సొమ్ము కొల్లగొడుతున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామని ఒక వ్యక్తి మహిళలకు టోకరా వేశాడు. హామీ లేకుండా ముద్ర రుణాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమోసం బయటపడింది. ఇటీవల కాలంలో దర్శి ప్రాంతంలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలం క్రితం అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి ఎన్‌టీఎల్‌ అనే సంస్థ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా కొందరు అనేకమంది చేత డబ్బులు కట్టించుకున్నారు. అతితక్కువ కాలంలో చెల్లించిన నగదుకు రెట్టింపు అవుతుందని ఆశ చూపారు. నెలనెలా అధిక వడ్డీలు ఇస్తామని ఎర వేశారు. దీంతో వందలాది మంది లక్షలాది రూపాయలు చెల్లించారు. ఇదే అదనుగా కేటుగాళ్లు చైన్‌ సిస్టం ద్వారా ఖాతాదారులను చేర్చితే మరింత ఆదాయం వస్తుందని నమ్మబలికారు. ఒక్కొక్కరు నల్గురు వ్యక్తులను అందులో చేర్చే విధంగా ప్లాన్‌ చేసి వీలైనంత వరకు ఎక్కువ మంది ద్వారా డబ్బులు కట్టించుకున్నారు. అప్పటివరకు చెప్పిన ప్రకారం వడ్డీలు చెల్లిస్తూ వచ్చారు. కేటుగాళ్లు తమ టార్గెట్‌ పూర్తికాగానే యాప్‌ ఎత్తేశారు. దీంతో చెల్లించిన నగదు గురించి ఎవరిని అడగాలో అర్థంకాక లబోదిబోమన్నారు. సంస్థ ఎక్కడ ఉందో అడ్రస్‌ కూడా తెలియకుండా అధికంగా డబ్బులు వస్తాయని ఆశపడి మోసపోయారు. అదేవిధంగా మరో మాయగాడు ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేకమంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి దర్శి పోలీసులకు పట్టుపడిన విషయం విదితమే. ఏకంగా ఎస్‌ఐ పోస్టు ఇప్పిస్తానని హోంగార్డు వద్ద డబ్బులు తీసుకొని దొరికిపోయాడు.

ముద్ర రుణాల పేరుతో మోసం

తాజాగా దర్శి పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి హామీలు లేకుండా ముద్ర రుణాలు ఇప్పిస్తానని మహిళలను నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. అనేకమంది ఏడాది క్రితం ఆ వ్యక్తికి డబ్బులు చెల్లించి రుణాలు రాక ఇంతకాలం ఎదురు చూశారు. తమను మోసం చేశాడన్న విషయాన్ని గుర్తించిన ఒక మహిళ రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళకు రుణం ఇప్పిస్తానని ఏడాది క్రితం రూ.20 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆవ్యక్తి అనేకమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. దర్శి ప్రాంతంలో ఇలాంటి మోసగాళ్లు ఇంకా అనేకమంది ఉన్నారు. కొంతమంది భూములు లేకుండా ఇతరులకు చెందిన స్థలాలను ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ర్టేషన్లు చేసి లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. కొద్దినెలల క్రితం ఇతర దేశాల్లో ఉంటున్న విజయవాడకు చెందిన ఒక మహిళకు కురిచేడు మండలంలో తక్కువ ధరకు భూమి ఇప్పిస్తానని నమ్మబలికి ఇతరుల భూమిని రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. కొంతకాలం తర్వాత ఆమహిళ స్వదేశానికి వచ్చి కొనుగోలుచేసిన భూమిని చూసుకునేందుకు అక్కడకు వెళ్లగా, ఆభూమి ఇతరులదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా అనేక రకాలుగా ప్రజలను చీటింగ్‌ చేస్తూ కొంతమంది మాయగాళ్లు విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఈ కేసులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 02:52 AM