ఉపాధి మెటీరియల్ కోటా నిధుల వినియోగంపై దృష్టి
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:48 AM
ఉపాధి హామీ మెటీరియల్ కోటా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలతో ఆందోళన చెందుతున్న నేతలు, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ఇటు జిల్లా, అటు రాష్ట్రస్థాయి అధికారులతో పలువురు ప్రజాప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై నేతలు, అధికారుల కసరత్తు
సీఎంవో దృష్టికి తీసుకెళ్లిన ప్రజాప్రతినిధులు
రాష్ట్రమంతా సమస్యగా వివరణ
కేంద్రం ఆంక్షలతో నిధులున్నా వినియోగించుకోలేని దుస్థితితో ఆందోళన
ఉపాధి హామీ మెటీరియల్ కోటా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలతో ఆందోళన చెందుతున్న నేతలు, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ఇటు జిల్లా, అటు రాష్ట్రస్థాయి అధికారులతో పలువురు ప్రజాప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం కేంద్రం పెట్టిన షరతుల ప్రకారం అయితే గ్రామాల్లో పనులు చేయడం వీలుకాదన్న భావన అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఒంగోలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులపై కేంద్రం పెట్టిన మెలికతో పనులు ఎలా చేయాలన్న దానిపై ఇటు నేతలు, అటు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరతతో అల్లాడుతున్న సమయంలో ఈ కొద్ది నిధులను కూడా వాడుకొనే అవకాశం కేంద్ర నిబంధనలతో చేజారుతుందన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. అదే విషయాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పథకాన్ని పర్యవేక్షించే జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ జోసఫ్‌కుమార్ ఇతర అధికారులతో మాట్లాడారు. సమస్య తీవ్రతతోపాటు రాష్ట్రం అంతటా ఇలాంటి ప్రతికూల పరిస్థితే ఏర్పడే అవకాశం ఉండటంతో ఉన్నతస్థాయిలో కదిలారు. అందుబాటులో ఉన్న నిధులు కూడా వినియోగించుకోలేకపోతే అవి మురిగిపోయే ప్రమా దం ఉన్న అంశాన్ని వారు సీఎం కార్యాలయ ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు సూచించాలని కోరినట్లు సమాచారం.
పనుల పరిశీలన
స్థానికంగా మండలాలు, పంచాయతీల వారీగా ఇప్పటికే మంజూరైన పనులు, వాటిలో పూర్తయిన వాటిని క్లోజర్ లోనూ, అసలు ప్రారంభం కాని వాటి వివరాలు తీస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన విధంగా 31 శాతం కన్నా అధికంగా పనులు జరిగిన వాటిని కూడా పూర్తయిన జాబితాలోకి చేర్చి, కొత్తవాటిని చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే పూర్వపు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోని 729 పంచాయతీలలో దాదాపు 75వేల పనులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశారు. వాటిలో పూర్తిస్థాయిలో చేసినవి 10శాతం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ప్రారంభంకానివి మరో 5శాతం ఉన్నాయి. అలాచూసినా అన్నీ కలిపి 15శాతం మాత్రమే పూర్తయిన జాబితాలో లేదా రద్దు జాబితాలోకి వెళ్తాయి. ఇంకా సుమారు 62 వేల పనులు ఉంటాయి. వాటిలో అత్యధిక శాతం నాల్గో వంతు అటుఇటుగా పూర్తయి పురోగతి జాబితాలో ఉండగా 30శాతం కన్నా అధికంగా జరిగినవి మరొక 15 నుంచి 20శాతం మాత్రమే ఉన్నట్లు సమాచారం.
పది పనుల నిబంధనతో ఇబ్బంది
గతంలో పదిశాతం పని జరిగినా అవసరం అయినప్పుడు పూర్తి జాబితాలో చూపి వాటిని నిలిపేసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం కేంద్ర నిబంధనల ప్రకారం కనీసం 30శాతం పని పూర్తయితేనే దానిని పూర్తి జాబితాలో చూపడానికి వీలవుతుంది. ఈ పరిస్థితులలో అత్యధిక గ్రామాలలో వందల సంఖ్యలోనే పనులు జాబితా ఉంటుండగా మెటీరియల్ కోటా కింద 10 పనుల మించి ఆ గ్రామంలో చేసి ఉండరాదన్న నిబంధనతో ఎక్కడా చేపట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాలు కాకుండా ఇటీవల రూ.65కోట్ల మెటీరియల్ కోటా నిధులతో పనులు మంజూరు చేసిన గ్రామాలలో వాటి రద్దుకు, అలాగే పూర్తయిన జాబితాలో చూపే అవకాశాలను ప్రస్తుతం డ్వామా అధికారులు పరిశీలిస్తున్నారు. అలా పనులను 178 గ్రామాల్లో మంజూరు చేసి ఉన్నాయి. వాటిలో మార్కాపురం జిల్లాగా ఏర్పడిన నాలుగు నియోజకవర్గాలలో 77 పంచాయతీలు, ప్రస్తుత జిల్లా పరిధిలోని 101 పంచాయతీలు ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల్లో పనులు వివిధ స్థాయిల్లోని డ్వామా అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్నారు.
నిధుల కోసం కసరత్తు
మండలానికి ఒకట్రెండు గ్రామాల్లో ఈ ఏడాది అతి తక్కువ పనులు మంజూరు చేసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అలాంటి చోట మెటీరియల్ కోటా పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నిధులు మురిగిపోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ ఒక అడుగు ముందుండి రెండు రోజులుగా కసరత్తు చేసి తన నియోజకవర్గంలో అలాంటి ఐదారు గ్రామాలను గుర్తించినట్లు సమాచారం. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కూడా అలాంటి పరిశీలనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి అవకాశం ఉంటే రూ.65కోట్లకు సంబంధించి మంజూరు చేసిన పనులను రద్దుచేసి ఆ స్థానంలో పరిమిత గ్రామాల్లోనైనా పనులు చేయడం ద్వారా నిధులను వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల గతంలో గ్రామానికి రూ.5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా ఇచ్చిన పనులు రద్దయిన గ్రామాలలో ఒక్కొక్కటి రు.50 లక్షల విలువైన పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.