ఆరోగ్య సంరక్షణపై దృష్టి
ABN , Publish Date - May 06 , 2026 | 02:42 AM
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మెరుగైన వైద్యసేవలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో 104 సంచార వైద్య వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.
వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు
104 సంచార వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు
విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం
ఒంగోలు కలెక్టరేట్, మే 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మెరుగైన వైద్యసేవలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో 104 సంచార వైద్య వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువ మంది పలు రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. అటువంటి పరీక్షలను ప్రజలకు ఉచితంగా చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వ్యాధుల ముందస్తు నివారణే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం 104 వాహనాల ద్వారా 14 రకాల పరీక్షలు చేసి 77 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారు. హిమోగ్లోబిన్, గర్భ, సంపూర్ణ మూత్ర, బ్లడ్ షుగర్, మలేరియా, హెచ్‌ఐవీ, విజువల్ ఇన్ఫెక్షన్, ఉప్పులో అయోడిన్, హెపటైటీస్ (బి), ఫైలేరియాసిస్, సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్ పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా కంప్లీట్ బ్లడ్ టెస్ట్ (సీబీటీ) చేయనున్నారు. అందులో 14రకాల వైద్యపరీక్షలు ఉంటాయి. వీటితోపాటు మరికొన్నింటిని కూడా చేయనున్నారు. దీని వలన పరీక్ష చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి చికిత్స అందించడం సులభతరమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అ వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తే పేదలకు ఎంతో మేలు చేకూరనుంది. ఇప్పటి వరకూ ఆయా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంతో స్వగ్రామాల్లోనే ఆయా వైద్య పరీక్షలు ఉచితంగా అందుబోటులోకి రానున్నాయి. అవసరమైన మందులను కూడా పూర్తిగా వైద్యులు అందించనున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ పెద్దపీట వేయడం పేద కుటుంబాల్లో వెలుగులు నింపనుంది.