Share News

ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:00 PM

ఓటరు జాబితా సవరణలో జరిగే ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం నియోజకవర్గస్థాయి ఓటర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

‘సర్‌’ విజయవంతానికి కృషి చేయాలి

పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా సవరణలో జరిగే ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం నియోజకవర్గస్థాయి ఓటర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, సీనియర్‌ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూన్‌ 15 నుంచి జులై 15 వరకూ బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఓటర్లు పేర్లు చేర్పులు, మార్పులు, సవరణలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా సమర్పించి రశీదులు పొందాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పేర్కొన్నారు.

సర్‌పై అవగాహన ఉండాలి : ఎమ్మెల్యే కందుల

మార్కాపురం రూరల్‌ : ఎస్‌ఐఆర్‌ (సర్‌)పై కార్యకర్తలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో మంగళవారం సర్‌పై బూత్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలకు, నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటర్‌ లిస్టును దగ్గర పెట్టుకొని ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఓటర్‌ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. మీ వార్డు, బూత్‌ల పరిధిలో ఓట్ల వివరాల జాబితా సక్రమంగా ఉందా లేదా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు కొప్పుల శ్రీనివాసులు, కనిగిరి బాల వెంకటరమణ, వెంకటరెడ్డి, నాయకులు, బూత్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:00 PM