26 గ్రామాల్లో ఫ్లోరిన్
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:58 PM
ముండ్లమూరు, మండలంలోని 26 గ్రామాల్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేపట్టిన సర్వేలో తేలింది.
కెల్లంపల్లిలో 17 శాతం
230 చేతి పంపులకు డేంజర్ గుర్తు
ముండ్లమూరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని 26 గ్రామాల్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో ఆశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో ఉన్న చేతి పంపుల ద్వారా వస్తున్న నీటిని తాగవద్దని సిబ్బంది ద్వారా ఎర్ర గుర్తువేశారు. మండలంలోని కెల్లంపల్లిలో 17 శాతం ఫ్లోరిన్ ఉంది. జిల్లాలోనే ఎక్కువ ప్లోరిన్ శాతం ఉన్న గ్రామంగా నమోదైంది. పెద ఉల్లగల్లు, పులిపాడు, వేముల, పూరిమెట్ల, ఉమామహేశ్వర అగ్రహారం, బొప్పూడివారిపాలెం, ఈదర, మక్కెనవారిపాలెం, పసుపుగల్లు, చింతలపూడి, బృందావనం తండా, కమ్మ వారిపాలెం, రాజగోపాల్‌రెడ్డినగర్, చినఉల్లగల్లు, కొమ్మ వరం, బంగారమ్మగుట్ట, వేములబండ, రెడ్డినగర్, లక్ష్మీనగర్, బసవాపురం, కొక్కెరకొండాయపాలెం, జగత్ నగర్, నందమూరి నగర్, పలుకురాళ్ళ తండా, శ్రీనివాస నగర్ గ్రామాల్లో ప్లోరిన్ శాతం ఉంది. ఆయా గ్రామాల్లో చేతి పంపులు ఉన్న గ్రామాల్లో నీటిని పరిశీలించటంవల్ల ఫ్లోరిన్ శాతం అధికంగా ఉన్నట్టు వెల్లడైంది.
మండలంలో 21 పంచాయతీల పరిధిలో 48 గ్రామాలు ఉన్నాయి. అందులో 26 గ్రామాల్లో ఫ్లోరిన్ ఉంది. ఈసందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఏ హనుమాన్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ మండలంలోని 26 గ్రామాల్లో ఉన్న చేతి పంపుల్లో నీటని ల్యాబ్‌లో పరీక్షించినట్టు తెలిపారు. కెల్లంపల్లి గ్రామంలో 17 శాతం ఫ్లోరిన్ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైందన్నారు. మిగతా గ్రామాల్లో కూడా 15, 10, 6, 2 శాతం ఉన్నట్టు తేలిందన్నారు. 230 చేతి పంపుల్లో నీటిని వాడవద్దని, ముందస్తుగా ఆ చేతి పంపులకు ఎర్రగుర్త వేయించినట్టు చెప్పారు.