Share News

హెచ్చుతగ్గులు

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:45 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సాగుతోంది. మంగళవారం మార్కెట్‌లో గతం కన్నా నోబిడ్‌లు దాదాపు 15శాతం తగ్గడంతో పాటు సగటు ధర సుమారు కిలోకు రూ.9వర కు పెరిగింది. బుధవారం అంతకన్నా ఎంతో కొంత పెరుగుదల ఉంటుందని రైతులు ఆశిం చారు.

హెచ్చుతగ్గులు

ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో స్వల్పంగా పెరిగిన నోబిడ్‌లు, తగ్గిన సగటు ధర

ఎస్‌ఎల్‌ఎస్‌లో పెరిగిన సగటు ధర

రెండు రీజియన్లలో 0.60 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు

ఒంగోలు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది పొగాకు మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సాగుతోంది. మంగళవారం మార్కెట్‌లో గతం కన్నా నోబిడ్‌లు దాదాపు 15శాతం తగ్గడంతో పాటు సగటు ధర సుమారు కిలోకు రూ.9వర కు పెరిగింది. బుధవారం అంతకన్నా ఎంతో కొంత పెరుగుదల ఉంటుందని రైతులు ఆశిం చారు. ఇక నుంచి మార్కెట్‌ గాడిలో పడుతుం దని భావించారు. అయితే బుధవారం మార్కె ట్‌ హెచ్చుతగ్గులతో సాగింది. గతంతో పోల్చితే పెద్ద ఆందోళనకరంగా లేకపో యినప్పటికీ మంగళవారం కన్నా నోబిడ్‌ లు స్వల్పంగా పెరిగాయి. ప్రత్యేకించి ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో నోబిడ్‌లు పెరగడంతోపాటు సగటు ధరలు తగ్గాయి. ఈ రీజియన్‌లో ఐదు వేలం కేంద్రాలు ఉండగా బుధవారం 3,118 బేళ్లు అమ్మకానికి వచ్చాయి. అందులో 2,222 బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేశారు. గరిష్ఠ ధర కిలో రూ.250, కనిష్ఠ ధర కిలో రూ.160 లభించింది. సగటు ధర కిలోకు రూ.191.89 దక్కింది. తిరస్కరించిన బేళ్లలో 717 (23శాతం) నోబిడ్‌లు ఉన్నాయి. మంగళవారం మార్కెట్‌లో ఈ రీజియన్‌లో సగటు ధర కిలో రూ.198.47 లభించగా, నోబిడ్‌లు 18.62శాతం మాత్రమే ఉన్నాయి. అలా ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో మంగళవారం కన్నా బుధవారం సగటు ధరలు తగ్గడమే కాక నోబిడ్‌లు పెరిగాయి. గరిష్ఠంగా ఒంగోలు-1 కేంద్రంలో 35.20 శాతం బేళ్లు, ఒంగోలు -2లో 27.03 శాతం, వెల్లంపల్లిలో 25.77 శాతం నోబిడ్‌ అయ్యాయి.

రోజుకో రీతిన కొనుగోళ్లు

ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో ఉన్న ఆరు వేలం కేంద్రాలకు బుధవారం 2,894 బేళ్లను రైతులు అమ్మకానికి రైతులు తీసుకొచ్చారు. 2,234 బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేశారు. సగటు ధర కిలోకు రూ.204.30 లభించింది. కాగా తిరస్కరణకు గురైన వాటిలో 15.55 శాతంతో 450 బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. ఒక్క కనిగిరిలోనే నోబిడ్‌లు 45.41శాతం ఉన్నాయి. ఈ రీజియన్‌లో మంగళవారం నోబిడ్‌లు 14.48 శాతం ఉండగా సగటు ధర కిలోకు రూ.201.45 లభించింది. అలా చూస్తే ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో మంగళవారం కన్నా ఒక్క శాతం నోబిడ్‌లు పెరగ్గా సగటు ధర కిలోకు రూ.3 వరకు పెరిగింది. ఇలా రోజుకో రకంగా నిలకడ లేకుండా హెచ్చుతగ్గులతో మార్కెట్‌ నడుస్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ గత వారం కన్నా ప్రస్తుతం నోబిడ్‌లు తగ్గడం, ఎంతో కొంత సగటు ధరలు పెరగడం కాస్తంత ఊరటనిచ్చే అంశం. ఇదిలా ఉండగా బుధవారం ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో 0.30 మిలియన్‌ కిలోలు, ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 0.30 మిలియన్‌ కిలోలు వెరసి 0.60 మిలియన్‌ కిలోల పంట కొనుగోలు చేశారు.

Updated Date - Jul 16 , 2026 | 02:45 AM