యువకుడి హత్యకేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:43 PM
యువకుడి హత్యకేసులో ఐదుగురు యువకులను చీరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
హరిప్రసాద్‌నగర్(చీరాల), ఫిబ్రవరి3 (ఆంధ్రజ్యోతి) : యువకుడి హత్యకేసులో ఐదుగురు యువకులను చీరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను డీఎస్పీ మొయిన్ వివరించారు. కారంచేడుకు మండలం స్వర్ణకు చెందిన కొండే త్రినాథ్(19) జాండ్రపేటలోని నానమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్లగా పరిచయం ఉంది. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే యువతితో విఠల్‌నగర్‌కు చెందిన షేక్ గౌస్ ఈసూబ్‌తో కూడా పరిచయం ఉంది. ఇదిలా ఉండగా, త్రినాథ్, ఆయన ప్రేయసైన యువతి ఒక రోజు ఒక లాడ్జి నుంచి బయటకు రావడాన్ని గౌస్ చూసి కోపోద్రేకుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఎలాగైన త్రినాథ్‌ను అడ్డు తొలగించుకుని ఆమెకు దగ్గరవ్వాలని పథకం వేశాడు. ముందుగా త్రినాథ్‌తో గౌస్ స్నేహం నటించాడు. గత నెల 27న రాత్రి పథకం ప్రకారం విఠల్‌నగర్ చెందిన మరో నలుగురు వల్లెపు దేవహర్ష, శీలం భగవంతుడు, కేదరుపల్లి చంద్రప్రకాష్, వల్లెపు వాసులతో కలిసి హరిప్రసాద్‌నగర్ సమీపంలోని రైలు పట్టాల వద్దకు వచ్చారు. మద్యం తాగేందుకు రావాలని త్రినాథ్‌ను నమ్మకంగా పిలిపించారు. అక్కడ మద్యం సేవించి బీరు సీసాతో త్రినాథ్ శరీరంపై పలుమార్లు క్రూరంగా పొడిచారు. అనంతరం పెద్దరాయితో తల వెనుక భాగాన్ని చిధ్రం చేశారు. దీంతో త్రినాధ్ మృతి చెందగా నిందితులు పరారయ్యారు. మృతుని సోదరుడు హేమంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసును వేగంగా చేధించిన సీఐ సుబ్బారావు, ఎస్సై రాజ్యలక్ష్మీ, వెంకటేశ్వరరెడ్డి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. రివార్డులు ప్రకటించారు.