రేపు తొలివిడత పల్లెపోరు
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:00 AM
జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. అదేరోజు కందుకూరు మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
77 పంచాయతీల సర్పంచ్‌లు,
610 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్
అదే రోజు కందుకూరు మున్సిపల్ ఎన్నికలు
నేటి సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు
సిబ్బంది, మెటీరియల్ తరలింపు
విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
ఏర్పాట్లపై ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
హాజరైన కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. అదేరోజు కందుకూరు మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 515 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా తొలివిడతలో ఒంగోలు, కొండపి నియోజక వర్గాల పరిధిలోని గ్రామాల్లో ఈనెల 26న పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఎనిమిది మండలాల్లోని 139 సర్పంచ్‌లు 1,396 వార్డుసభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 62 సర్పంచ్‌లు, 782 వార్డుసభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 77 సర్పంచ్‌లతోపాటు 610 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ పరిధిలో 1,89,922 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలుత 1,434 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించగా ఏకగ్రీవాలు పోను ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న వాటికి సంబంధించి 840 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కందుకూరు మున్సిపాలిటీలో చైర్మన్, 40 వార్డు కౌన్సిలర్ల పదవులకు కూడా 26న పోలింగ్ జరగనుంది. అక్కడ 47,471 మంది ఓటర్లు ఉండగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఇటు పంచాయతీలు, అటు కందుకూరు మున్సిపాటిటీలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠ మంగళవారం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఇతర అధికారులు ఇక్కడి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరై జిల్లాలో చేసిన ఏర్పాట్లను వివరించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అనంతరం ఓట్లు లెక్కించి గెలుపొందిన వారి వివరాలు ప్రకటించడంతోపాటు ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
కందుకూరు మున్సిపాలిటీలో ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అక్కడ అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ చేరేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయా మండల కేంద్రాలలో సిబ్బందికి మెటీరియల్ అందించి అనంతరం ప్రత్యేక బస్సుల్లో గ్రామాలకు తరలించనున్నారు. మరోవెపు ఈ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీ ఎన్నికలు 840 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుండగా వాటిలో 73 సమస్యాత్మక, 35 తీవ్ర సమస్యాత్మకంగా గుర్తించారు. అలాగే కందుకూరులో 65 పోలింగ్ కేంద్రాలు ఉండగా 13 సమస్యాత్మక, 9 తీవ్ర సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పంచాయతీ ఎన్నికలకు 1,168 మంది, మున్సిపాలిటీలకు 157 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందితో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రౌడీషీటర్లు, ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే అవకాశం ఉన్న వారిగా గుర్తించిన మొత్తం 1,047 మందిని ఇప్పటికే బైండోవర్ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
ప్రచారానికి తెర
గురువారం పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగిసింది. కందుకూరు మున్సిపాలిటీ అలాగే పెద్ద స్థాయి గ్రామపంచాయతీలుగా ఉండి పోటాపోటీ వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న సింగరాయకొండ, టంగుటూరు, మర్రిపూడి, జరుగుమల్లి మండలకేంద్రాలు, కామేపల్లి వంటి గ్రామాల్లో వారంరోజులుగా విస్తృతంగా బహిరంగ ప్రచారం సాగుతుండగా మంగళవారం సాయంత్రంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఈ సందర్భంగా కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సారథ్యంలో భారీ ర్యాలీ టీడీపీ కూటమి శ్రేణులు నిర్వహించారు. మరోవైపు మంత్రి డాక్టర్ స్వామి కొండపి, పొన్నలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.