బీపీఎస్‌లో ఫస్ట్
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:02 AM
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో ఆదాయ వనరుల పెంపుకోసం రాష్ట్ర పురపాలక శాఖ ప్రవేశపెట్టిన బీపీఎస్‌లో ఒంగోలు నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ఊసేలేదు.
రాష్ట్రంలోనే ఒంగోలు కార్పొరేషన్ ముందంజ
రూ.10కోట్లు వసూలు
ఇంకా దాదాపు రూ.10 కోట్లు వస్తాయని అంచనా
ప్రత్యేక చొరవ చూపిన అధికార యంత్రాంగం
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి) : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో ఆదాయ వనరుల పెంపుకోసం రాష్ట్ర పురపాలక శాఖ ప్రవేశపెట్టిన బీపీఎస్‌లో ఒంగోలు నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ఊసేలేదు. అప్పటి పాలకుల తీరుతో ఇష్టారాజ్యంగా అనధికార నిర్మాణాలు వెలిశాయి. దీంతో కార్పొరేషన్‌కుపెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. అయితే ప్రజాప్రభు త్వం అధికారంలోకి రాగానే మునిసిపాలిటీలు, కార్పొరేష న్లలో అభివృద్ధిపై దృష్టిసారించింది. అవసరమైన ఆదాయ వనరులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీపీఎస్‌ను పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించి గతేడాది నవంబరు 12న జీవో నెం. 225 విడుదల చేసింది. దీని ద్వారా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడంతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని భావిం చింది. ప్రత్యేకించి గతంలో 2014-19 ఈ స్కీంను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేయగా, 2024లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రారంభించింది. నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు గతేడాది నవంబరు 12 అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ఒంగోలు పరిధిలోని పలు అనుమతులు లేని భవనాల రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఒంగోలుకు 1,551 దరఖాస్తులు రాగా, వాటిలో 1,024 పరిష్కరించారు. కాగా అందులో పలు కారణాల చేత ఇంకా 440 పెండింగ్‌లో ఉండగా, మరో43 షార్ట్‌ఫాల్‌లో ఉన్నాయి అయితే ఇప్పటివరకు అందిన దరఖాస్తులలో ఒకటి మాత్రమే తిరస్కరణకు గురైంది. బీపీఎస్ ద్వారా ఒంగోలు కార్పొరేషన్‌కు రూ.10 కోట్లు వరకు ఆదాయం వచ్చింది. అయితే మార్చి21తో గడువు ముగియనున్న నేపథ్యంలో మిగిలిన దరఖాస్తులు పరిష్కారమైతే మరో రూ.5 నుంచి రూ.10 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నాటికి ఒంగోలు కార్పొరేషన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండగా, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ రూ.8.6 కోట్లు వసూలు చేసి రెండవస్థానంలో ఉంది. అయితే నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ రూ.6.4 కోట్లు వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.
కలిసొచ్చిన ఫీజుల వెసులుబాటు
విస్తీర్ణం ఆధారంగా చదరపు అడుగుకు రూ.40 నుంచి రూ.400 వరకు పీనలైజేషన్ ఫీజులు విధిస్తారు. నిర్మాణంలో ఉల్లంఘలనపై రూ.20వేల నుంచి రూ.80 వేల వరకు అపరాధ రుసుము ప్రాథమికంగా చెల్లించాలి. అనధికార అంతస్తులకు చదరపు అడుగుకు రూ.120 నుంచి రూ.200 వరకు చెల్లించాలి.అయితే60 గజాల్లోపు ఇంటి నిర్మాణాలకు (జీ+1)కు బీపీఎస్ అవసరం లేదు. అలాగే 1997 డిసెంబరు31 నాటికి ముందు చేపట్టిన నిర్మాణాలపై మొత్తం పీనలైజేషన్ రుసుములో 25ు రాయితీ ఉంటుంది. నోటిఫైడ్ మురికివాడల్లో నివాస భవనాలపై 50ు రాయితీ ఉంటుంది. ఈ స్కీమ్ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలు, నగరపంచాయితీలతోపాటు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామపంచాయతీలలో వర్తించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బీపీఎస్ నిధులు స్థానిక సంస్థలకే..
అసలే ఆర్థిక ఇబ్బందులతో అభివృద్ధికి అవస్థలు పడుతున్న కార్పొరేషన్‌కు బీపీఎస్ వరంలా మారింది. దీంతో అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ ద్వారా వచ్చే నగదు మొత్తాలను ఆయా స్థానిక సంస్థలకే ఖర్చుచేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అన్న క్యాంటిన్‌లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, లెగసీ వ్యర్థాలు, స్ర్టోమ్ వాటర్ డ్రెయిన్‌లు, రోడ్లు, ఇతర ప్రాధాన్యత పనులకు వాడుకోవాలని సూచించింది. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు, లింక్ రోడ్‌లు, చెరువులు, రిక్రియేషన్ క్లబ్‌లు, ఓపెన్ లేఅవుట్‌ల పరిరక్షణకు వాడుకోవాలని పురపాలక శాఖ ఆదేశించడంతో నగర అభివృద్ధికి బీపీఎస్ నిధులు మరింత ఊరటనివ్వనున్నాయి.