మొక్కజొన్న పొలాల్లో మంటలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:05 PM
మొక్కజొన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో సుమారు 10 ఎకరాల పైచిలుకు పంట నష్టం జరిగింది.
10 ఎకరాల్లో కాలిన పంట.. లబోదిబోమంటున్న రైతులు
గిద్దలూరు టౌన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో సుమారు 10 ఎకరాల పైచిలుకు పంట నష్టం జరిగింది. గిద్దలూరు మండలం కేఎ్‌సపల్లె పంచాయతీ పరిధిలోని ప్రతా్‌పరెడ్డికాలనీ సమీపంలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఉప్పలపాడు, కేఎ్‌సపల్లె, ప్రతా్‌పరెడ్డి కాలనీ గ్రామాలకు చెందిన తుగ్గా రంగారెడ్డి, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, ఎక్కలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, కప్పెట సరస్వతి, భూపాని లింగమయ్య, నల్లబోతుల కాశమ్మ, మండ్ల తిరుపతయ్య, పసుపుల బాలఅంకమ్మ, శీలం మహాశంకరమ్మ, భూపని శివలింగయ్య, భూపని ప్రసాద్, భూపని శివయ్య, భూపని రాములు, యర్రం పోలిరెడ్డి, యర్రం రామిరెడ్డి, యర్రం సుబ్బమ్మ, యర్రం అంకిరెడ్డి, యర్రం నారాయణరెడ్డి, యర్రం నడిపి అంకిరెడ్డి, యర్రం చిన్నఅంకిరెడ్డి, యర్రం రామసుబ్బమ్మ, యర్రం రంగలక్ష్మమ్మ రైతులు సుమారు 31 ఎకరాల పైచిలుకు మొక్కజొన్న సాగు చేశారు. సాగు చేసిన పంటలో ఇటీవల కొంత మొక్కజొన్న కంకులను కోశారు. ఇంకా 10 ఎకరాల పైచిలుకు కోయాల్సి ఉంది. ఉప్పలపాడు గ్రామానికి చెందిన భూపని వెంకటేశ్వర్లు 2.68 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసి అందులో కొంత పైరు కూడా కోయలేదు. ఆదివారం మొక్కజొన్న పంటలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు మొత్తానికి పాకింది. దీంతో ఆయా రైతుల పొలాల్లో ఉన్న మిగిలిన మొక్కజొన్నతోపాటు భూపని వెంకటేశ్వర్లు మొత్తం పంట కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట పొలం బూడిద కావడంతో రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారి పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ సుమారు 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది.. రూ.10లక్షల మేర పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని చెప్పారు. సోమవారం వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించిన నష్టం అంచనా వేయనున్నారు.