Share News

ఎట్టకేలకు విముక్తి

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:19 AM

ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 1038 సర్వే నెంబర్‌లో 73.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్రాంతాలు, షాపుల (నామ్‌ రోడ్డుకు రెండు వైపులా కాకానిపాలెం నుంచి భవానీ సెంటర్‌ వరకు)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయా ప్రాంతాలు దేవదాయశాఖ పరిధిలో చేరి క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో మంత్రి రవికుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకొని సబ్‌డివిజన్‌ చేయించారు.

ఎట్టకేలకు విముక్తి
నిషేధిత జాబితా నుంచి తొలగించిన అద్దంకిలోని మెయిన్‌ రోడ్డు ప్రాంతం

దేవదాయశాఖ నుంచి 19.48 ఎకరాల నివాస ప్రాంతానికి ఊరట

క్రయ, విక్రయాలకు తొలగిన అడ్డంకులు

ప్రత్యేక దృష్టితో పరిష్కారం చూపిన మంత్రి గొట్టిపాటి

అద్దంకి పట్టణంలో 700 కుటుంబాలకు ప్రయోజనం

అద్దంకి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 1038 సర్వే నెంబర్‌లో 73.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్రాంతాలు, షాపుల (నామ్‌ రోడ్డుకు రెండు వైపులా కాకానిపాలెం నుంచి భవానీ సెంటర్‌ వరకు)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయా ప్రాంతాలు దేవదాయశాఖ పరిధిలో చేరి క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో మంత్రి రవికుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకొని సబ్‌డివిజన్‌ చేయించారు. దేవాలయాల భూములు పోను 71.48 ఎకరాలను గ్రామకంఠంగా మారు స్తూ ఇటీవల కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అద్దంకి పట్టణంలోని పలు చోట్ల నివాస ప్రాంతాలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కలిగింది. దీంతో క్రయవిక్రయాలకు పూర్తి అడ్డంకులు తొలగాయి.

దశాబ్దకాలంగా ఇబ్బందులు

అద్దంకి పట్టణం నడిబొడ్డున ఉన్న పలు ప్రాంతాలు రెవెన్యూ, దేవదాయ శాఖల నిషేధిత జాబితాలో చేరటంతో దశాబ్దకాలంగా క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరమైనా అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలో 1096 సర్వే నెంబరులో 19.48 ఎకరాలు ఆకుల వారి ధర్మతోపుగా నమోదైంది. దీంతో గత దశాబ్దకాలంగా రెవెన్యూ అధికారులు 22ఏలో చేర్చగా, దేవదాయశాఖ అధికారులు 22సీ జాబితాలో చేర్చారు. దీంతో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా అద్దంకి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపం వరకు పోలీ్‌సస్టేషన్‌ రోడ్డుకు రెండు వైపులా ఉన్న పాత ఆంధ్రాబ్యాంక్‌ ప్రాంతం, ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వెనుక వైపు రైస్‌మిల్‌ ప్రాంతం, బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం, పశువైద్యశాల, రాణిగారి తోట, ప్రకాశం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంతాలు, ఆర్‌అండ్‌బీ బంగ్లా, గీతామందిరం రోడ్డు నుంచి పోలీస్‌ స్టేషన్‌తో పాటు పోలీస్‌ స్టేషన్‌ పక్కబజారు, కురిచేటి వారి రైస్‌ మిల్‌ సమీపంలోని పలు ప్రాంతాలలో సుమారు 700 కుటుంబాలు నివాసం ఉండే భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిషేధిత జాబితాలో చేరాయి. దీంతో క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

మంత్రి చొరవతో ఊరట

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక దృష్టిసారించారు. పలుదఫాలు అటు రెవెన్యూ, ఇటు దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఈక్రమంలో గత జూన్‌ 3వ తేది రెవెన్యూ శాఖ పరిధిలో 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు ఇవ్వటంతో ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఉత్తర్వుల కాపీని మంత్రి రవికుమార్‌, కలెక్టర్‌ అందజేశారు.

దేవదాయశాఖ అధికారులతో సమావేశం

రెవెన్యూపరంగా లైన్‌క్లియర్‌ అయినప్పటికి దేవదాయశాఖకు సంబంధించి 22సీ జాబితాలో ఉండటంతో క్రయ, విక్రయాలకు అడ్డంకులు తొలగలేదు. మంత్రి రవికుమార్‌ మరలా దేవదాయశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేయటంతో సంబంధిత అధికారులు కసరత్తు చేసి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ శుక్రవారం ఎండోమెంట్‌ కమిషనర్‌ కె.రామచంద్రరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అటు రెవెన్యూ, ఇటు దేవదాయశాఖల నుంచి 1,096 సర్వే నెంబర్‌లోని 19.48 ఎకరాల భూమికి విముక్తి కలిగింది.

700 కుటుంబాలకు లబ్ధి

అద్దంకి పట్టణం నడిబొడ్డున ఉన్న నాలుగు వార్డుల పరిధిలోని సుమారు 700 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇదే సర్వే నెంబర్‌లో ప్రకాశం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బాలుర ఉన్నత పాఠశాల, పశువైద్యశాల, రాణిగారి సత్రం, బీఎ్‌సఎన్‌ కార్యాలయం, పంచాయతీరాజ్‌ కార్యాలయం, పోలీ్‌సస్టేషన్‌, ప్రకాశం బాలికల ఉన్నత పాఠశాల తదితర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉండటంతో అన్నింటి విస్తీర్ణాలను సర్వే చేసి సబ్‌డివిజన్‌ చేశారు. ఆ ప్రాంతవాసులలో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. నిషేధిత జాబితా నుంచి విముక్తి కలిగించిన మంత్రి రవికుమార్‌కు ఆయా ప్రాంతాలలో నివాసం ఉండే కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 26 , 2026 | 03:19 AM