పదవుల కోసం ఫైట్
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:54 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసేందుకు క్యాడర్ సై అంటోంది. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి జిల్లాస్థాయి వరకు పదవులను ఆశిస్తోంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో వేడి మొదలైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటున్న క్యాడర్
ఆర్థిక వనరులు, సామాజిక సమతూకం అంటున్న ఎమ్మెల్యేలు
రాజీ లేదు.. రెబల్‌కు సిద్ధమంటున్న కొందరు
కూటమి పార్టీల్లో పరిస్థితి ఇదీ..
ముఖ్యంగా టీడీపీలోనే అధికంగా పోటీ
డబ్బుంటేనే ముందుకు రండి అంటున్న వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసేందుకు క్యాడర్ సై అంటోంది. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి జిల్లాస్థాయి వరకు పదవులను ఆశిస్తోంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో వేడి మొదలైంది. ప్రధానంగా ఇటు పార్టీలకు అంకితమై పనిచేస్తున్న కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు ఒకవైపు.. ఆర్థిక వనరులు, సామాజిక సమీకరణలు, బంధుత్వాలను ఆసరా చేసుకొని పదవుల కోసం వేచిచూస్తున్న వ్యక్తులు మరోవైపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఆయా పార్టీల్లో పదవుల కోసం పోటీ పెరిగింది. ప్రధానంగా అధికార కూటమికి సారథ్యం వహిస్తున్న టీడీపీలో అది తారస్థాయికి చేరింది. అవకాశం దక్కకపోతే అమీతుమీకి కిందిస్థాయిలో ఆయా పార్టీల్లోని క్యాడర్ సిద్ధమవుతోంది. దీంతో స్థానిక ఎన్నికల సమరం నాయకులు, కార్యకర్తల మధ్య అగాధాన్ని సృష్టించే పరిస్థితి కనిపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీలోని వార్డు నుంచి జిల్లాస్థాయి వరకు వేలాది పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 925 పంచాయతీలకు సర్పంచ్‌లు, 9,193 వార్డులకు సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. రెండు జిల్లాల్లో 48 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి వారు రెండు జడ్పీలకు చైర్మన్‌లను ఎన్నుకోవాల్సి ఉంది. ఆ మేరకు పదవులు లభించనున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 648 ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. వారి ద్వారా 48 మంది ఎంపీపీలు ఎన్నుకోబడతారు. వీటికి తోడు మండల, జిల్లా పరిషత్‌లలో కోఆప్షన్ సభ్యుల నియామకాలు కూడా జరుగుతాయి. ఆ రకంగా కొన్ని వేల పదవులు ఎన్నికల ద్వారా నాయకులకు లభించబోతున్నాయి. దీంతో ఆయా పార్టీల్లోని కార్యకర్తలు, ప్రత్యేకించి కిందిస్థాయిలో నాయకత్వంలో ఉన్న నేతలు ఆ పదవులపై దృష్టి సారించారు. పోటీకి సై అంటున్నారు.
కూటమి పార్టీల్లో భారీ పోటీ
‘స్థానిక’ పదవుల కోసం అధికార కూటమి పార్టీల్లో అధికంగా పోటీ నెలకొంది. అది టీడీపీలో ఎక్కువగా ఉంది. స్థానిక సంస్థల పదవులైతే ఇప్పుడు పోతే మళ్లీ సార్వత్రిక ఎన్నికల అనంతరమే వస్తాయి. అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఏమో అన్న ఉద్దేశంతో టీడీపీలో ఈ పదవులను ఆశిస్తున్న వారంతా తాడోపేడో అంటూ పావులు కదుపుతున్నారు. కొందరు ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, వారికి పరిచయం ఉన్న నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. వారిపై ఒత్తిడి కూడా పెంచారు. ‘నా చేతిలో చాలా ఓట్లు ఉన్నాయి. ఆ ఊరిపై నాదే పెత్తనం. మండలాన్ని శాసించగలను’ అంటూ తమ సత్తాను చెప్పుకుంటూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధిష్ఠానం పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కుతాయంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ కిందిస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
డబ్బు.. కులమే ప్రమాణికం?
కార్పొరేషన్ మేయర్, మునిసిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వారి పరిధిలోని ఓటర్ల చేత ఎన్నుకోబడాలి. ఎంపీటీసీల ద్వారా ఎంపీపీ, జడ్పీటీసీల ద్వారా జడ్పీ చైర్మన్ మాత్రమే ఎన్నికవుతారు. దీంతో ప్రత్యక్ష ఓటింగ్‌లో ఓటర్ల మద్దతుతో వెళ్లాలంటే ఆర్థికపరమైన అవసరాలు ఎక్కువ ఉంటాయన్న వాదనను కూడా నాయకులు తెరమీదకు తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులుగా ఉన్న నాయకులే కీలకసాత్ర పోషించాలని పార్టీలు స్పష్టం చేశాయి. 94 శాతం కన్నాపైన విజయం సాధించాలని టీడీపీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులను ఆదేశించింది. ఏకగ్రీవాలు జరిగితే మీకు టికెట్ ఉండదంటూ వైసీపీ అధినేత జగన్ తన పార్టీ నాయకులను హెచ్చరించారు.
ఆర్థిక వనరులు, కుల సమీకరణాలకు ప్రాధాన్యం
నాయకులంతా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక వనరులు, కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓటర్ల మద్దతు ఉండి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఘనత ఉన్నప్పటికీ ఆర్థికస్థోమత లేకుంటే టికెట్ లేదన్నట్లుగా నాయకులు మాట్లాడటం ప్రారంభించారు. మీ కులం ఓట్లు తక్కువ, అది కూడా మీకు మైనస్ అంటూ చెప్తున్నారు. పార్టీ కన్నా డబ్బు, కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ నేతలు మట్లాడటం ప్రారంభించగానే ఆయా పార్టీల్లోని కిందిస్థాయి క్యాడర్, నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఎదురు దాడికి దిగుతున్నారు. దీనికి తోడు కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు తమ బంధువులకు, మిత్రులకు ‘స్థానిక’ పదవులను కట్టబెట్టే ప్రయత్నాలను ప్రారంభించారు. ఆర్థికబలం ఉందన్న పేరుతో పార్టీతో ఏమాత్రం సంబంధం లేనివారిని రంగంలోకి తెచ్చే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇవి ఆయా పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను మరింత దిగ్ర్భాంతికి గురిచేస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు కూడా మాకు న్యాయం చేయలేరా? ఆ మాత్రం డబ్బులు సమీకరించుకొని పార్టీ కోసం కష్టపడిన వారిని గెలిపించుకోలేరా? అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. కొందరు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీ క్యాడర్‌కు మింగుడు పడని నేతల తీరు
వైసీపీ నాయకులైతే.. ‘మీరంతా పోటీ చేయాల్సిందే. ఇది జగన్ ఆజ్ఞ. మేము మాత్రం డబ్బు పెట్టలేము. మున్ముందు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మీకు న్యాయం జరగాలంటే పోటీ చేయండి’ అంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వస్తే పదవి గ్యారెంటీ అన్న హామీ ఇస్తే గెలిచినా, ఓడినా పోటీకి సిద్ధమంటూ పార్టీయేతర వ్యక్తులు కొందరు వైసీపీ నాయకుల వద్ద చర్చలు ప్రారంభించారు. ఇది ఆ పార్టీలోని సీనియర్ కార్యకర్తలకు మింగుడు పడని అంశంగా మారింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఆ పార్టీ ద్వితీయశ్రేణి, కిందిస్థాయిలో నాయకుల మధ్య నెలకొన్న ఉత్కంఠ ఏమలుపు తిరుగుతుందో చూడాల్సిన పరిస్ధితి నెలకొంది.