ఐదో.. సారీ...!
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:18 PM
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ద్వారా నూతన రైళ్లు నడపటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతిసారీ హామీ ఇవ్వటమే తప్పా ఆచరణలో అమలుకాలేదు. తాజాగా ఆగస్టు నెలలో రైళ్లు నడుపుతామని చెప్పిన మాట కూడా దాదాపుగా నీటిమూటైంది.
నడికుడి-కనిగిరి మధ్య
రైళ్లు నడపటంపై కదలిక నిల్..
అమలుకాని ఉన్నత అధికారుల హామీలు
ఈ రెండు స్టేషన్ల మధ్య అన్ని పూర్తి
ట్రయల్ రన్ సైతం విజయవంతం
వారి తీరుపట్ల ప్రజల తీవ్ర అసంతృప్తి
దర్శి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి) : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ద్వారా నూతన రైళ్లు నడపటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతిసారీ హామీ ఇవ్వటమే తప్పా ఆచరణలో అమలుకాలేదు. తాజాగా ఆగస్టు నెలలో రైళ్లు నడుపుతామని చెప్పిన మాట కూడా దాదాపుగా నీటిమూటైంది. నూతన రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి కనిగిరి వరకు తొలిదశ ఎనిమిది నెలల క్రితమే పూర్తయింది. అప్పటి నుంచి అదిగో రైలు.. ఇదిగో రైలు అంటూ ఇప్పటికి ఐదుసార్లు ఆర్భాటం చేయటమే తప్పా ఆచరణలో అమలు కాలేదు.
నడికుడి నుంచి కనిగిరి వరకు తొలిదశ లైన్ పూర్తి
నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 300 కిలోమీటర్లు దూరం రైల్వేలైన్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50శాతం నిర్మాణం పూర్తి చేశారు. నడికుడి నుంచి కనిగిరి వరకు 155 కిలోమీటర్లు రైల్వేలైన్, రైల్వేస్టేషన్ల నిర్మాణం పూర్తయింది. గత డిసెంబర్ నుంచి ఇక రైళ్లు నడపటమే తరువాయి అంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్పా పని జరగటం లేదు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా రైళ్లు నడిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన పింఛన్ల పంపిణీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆగస్టు నెలాఖరులోపు రైళ్లు నడిపేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ ఏ కారణం చేతనో కదలిక లేదు.
పూర్తికాని కోడ్ నంబర్ల ప్రక్రియ
ఇప్పటి వరకు నడికుడి నుంచి కనిగిరి మధ్య నిర్మించిన రైల్వేస్టేషన్లకు కోడ్ నెంబర్లు ఇవ్వలేదు. ఆ ప్రక్రియ పూర్తయితేనే రైళ్లు నడిచే అవకాశం ఉంటుంది. తొలుత విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతూ వచ్చారు. గత జూన్ నెలలో విశాఖ జోన్ ఆరంభమైంది. ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు రైళ్లు నడిపే విషయం గూర్చి పట్టించుకోవటం లేదు. దర్శి, కనిగిరి ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైళ్ల రాకపోకలు ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతుండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైళ్లు నడిపే కార్యక్రమాన్ని ఆరంభించాలని ప్రజలు కోరుతున్నారు.