Share News

పాఠశాలల్లో పండుగ

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:36 AM

జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు క్రీడా పోటీల్లో పాల్గొనడంతోపాటు వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. రాష్ట్రప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ను నిర్వహించింది.

పాఠశాలల్లో పండుగ
కొండపి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి స్వామి (ఇన్‌సెట్‌లో) రేణంగివరం పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్న మంత్రి గొట్టిపాటి, కలెక్టర్‌ రాజాబాబు

కోలాహలంగా మెగా పీటీఎం

సందడి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు

పెట్లూరులో మంత్రి డాక్టర్‌ స్వామి.. రేణంగివరంలో మంత్రి గొట్టిపాటి, కలెక్టర్‌ హాజరు

పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలు 8 విద్యార్థులు, తల్లిదండ్రులతో మాటామంతీ

తల్లికి వందనం నిధుల విడుదలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన తల్లులు

ఒంగోలు, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు క్రీడా పోటీల్లో పాల్గొనడంతోపాటు వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. రాష్ట్రప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ను నిర్వహించింది. మెగా పీటీఎం 4.0పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల నుంచి పట్టణాల వరకు ఊరూవాడా ఉన్న 1,556 విద్యాసంస్థల్లో జరిగింది. ఉదయం 9 గంటల నుంచే విద్యాలయాలు కళకళలాడాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థుల ఉన్నతికి, వారిలో వ్యక్తిత్వ వికాసానికి పాఠశాలల్లో తాము తీసుకుంటున్న చర్యలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మెగా పీటీఎంల సభల్లో మంత్రుల నుంచి వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు పాల్గొని మరింత ఉత్సాహపర్చారు. కొండపి మండలం పెట్లూరు హైస్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీస్వామి పాల్గొన్నారు. జే.పంగులూరు మండలం రేణంగివరంలో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, కలెక్టర్‌ రాజాబాబులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి హైస్కూలులో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు. కందుకూరులోని జడ్పీ బాలికల హైస్కూలులో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం హైస్కూలులో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. దర్శిలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అక్కడి సరస్వతి విగ్రహాలకు పూజలు చేయడంతోపాటు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్దికి, పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్‌ కోసం తీసుకుంటున్న ప్రత్యేక పథకాలను వివరించారు.

తల్లికి వందనంపై చర్చ

రాష్ట్రప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసిన విషయం విదితమే. జిల్లాలో మొత్తం 2,07,944 మంది విద్యార్థులకు సంబంధించిన 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో ఈనెల 22 నుంచి ఆ నిధులు జమయ్యాయి. పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికి పథకం వర్తింపజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం సభలకు విద్యార్థుల తరఫున వారి తల్లులు వేలాదిగా హాజరుకావడంతోపాటు తల్లికి వందనం నిధులు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పలుచోట్ల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు సైన్స్‌ ఎగ్జిబిషన్లను కూడా నిర్వహించారు.

Updated Date - Jul 25 , 2026 | 02:36 AM