యాప్‌లో ఎరువులు
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:08 AM
ఎరువులు పక్కదారి పట్టకుండా రైతుల అవసరానికి తగ్గట్టు అందించేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రైతుకు ఎంత పొలం ఉంది? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు?
అక్రమాలకు అడ్డుకట్ట
ఈనెల 8 నుంచే అమల్లోకి..
ప్రతి రైతూ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి
సాగును బట్టి తగిన మోతాదులో సరఫరా
మార్కాపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : ఎరువులు పక్కదారి పట్టకుండా రైతుల అవసరానికి తగ్గట్టు అందించేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రైతుకు ఎంత పొలం ఉంది? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఏఏ పంటలు సాగులో ఉన్నాయి? వాటికి ఎంత డీఏపీ, యూరియా అవసరమవుతుంది? అనే ప్రామాణికాల ఆధారంగా అందించబోతోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకాల నిర్వహణ వ్యవస్థ 2.0) యాప్‌ను తెచ్చింది. ఈ విధానం ఈనెల 8 నుంచే అమల్లోకి వచ్చింది. ఎరువులు కావాల్సిన రైతులు యాప్‌లో ఆధార్ నెంబరుతో వారి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతు ముందుగా యాప్‌లో రిజిస్టర్ అయితేనే ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. రైతు ఆధార్ నెంబరు రెవెన్యూ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో అనుసంధానం చేసి ఉండటం వల్ల ఎంత పొలం ఉంది? ఏ పంట సాగుచేస్తున్నాడు? వివరాలు అందులో తెలుస్తాయి. రైతు ప్రస్తుత ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ క్రాప్ చేసిన వెంటనే వారి పంటను బట్టి ఎంత మోతాదులో ఎరువులు అవసరమో యాప్‌లోనే తెలిసిపోతోంది. పైగా ఎరువుల డీలర్ల వివరాలు కూడా యాప్‌లోనే రైతుకు ప్రత్యక్షమవుతాయి. రైతు కోరుకున్న డీలరు వద్దకు వెళ్లి తీసుకోవచ్చు. అసవరమైన ఎరువులు ఒకేసారి తీసుకునే వీలు లేదు. రెండు లేదా మూడు దశల్లో తీసుకునేలా ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 1,34,789 హెక్టార్లు ఉంది. ఖరీఫ్‌లో 86వేల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎరువులు దాదాపు 70,3015 టన్నులు అవసరమని నివేదికను తయారు చేశారు. ప్రస్తుతం యాప్ ద్వారా ఎరువులు అందించే విధానం సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సిబ్బందికి, ఎరువుల డీలర్లకు శిక్షణ కూడా పూర్తి చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన విధానంతో రైతుకు ఉపయోగకరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.