ఫీడర్.. చకచకా
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:47 AM
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ఆధునికీకరణకు అంతా సిద్ధమవుతోంది. ఆ పనులకు భూమిపూజ చేసేందుకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో తక్షణం వాటిని ప్రారంభించేలా అటు కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ, ఇటు ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టారు.
వెలిగొండ కాలువ పనులకు అంతా సిద్ధం
గంటవానిపల్లి వద్ద రెండు బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు
వాటి నుంచి రోజుకు కనీసం రెండువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు మిక్సింగ్
18 కి.మీవద్ద మరో మినీ ప్లాంట్
త్వరలో సీఎం రాక నేపథ్యంలో తక్షణం పనులు చేపట్టేలా చర్యలు
ఒంగోలు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) :వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ఆధునికీకరణకు అంతా సిద్ధమవుతోంది. ఆ పనులకు భూమిపూజ చేసేందుకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో తక్షణం వాటిని ప్రారంభించేలా అటు కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ, ఇటు ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా అవసరమైన కాలువ కట్టలపై రాకపోకలకు వీలుగా ముళ్లపొదల తొలగింపు, చదును చేయడంతోపాటు కాంక్రీటు మిక్చర్ తయారీ కోసం బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇతర మిషనరీ, మెటీరియల్ తదితరాలను ఆ ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. సీఎం భూమిపూజ చేసిన వెంటనే కాంక్రీటు పనులు ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో పూర్తి చేసి నీరు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందుకోసం సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో గతేడాదిగా పలు అటంకాలను అధిగమించి ఒక్కో పని చేస్తున్నారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీఎం ఆదేశాలతో ప్రత్యేక దృష్టిసారించడంతో అనేక అంశాలు పరిష్కారమై పనులు ముందుకు సాగుతున్నాయి. ఈక్రమంలో టన్నెల్ నుంచి నీరు బయటకు వచ్చిన అనంతరం నల్లమల రిజర్వాయర్ (వెలిగొండ రిజర్వాయర్)కు వెళ్లేందుకు కొండల అంచున తవ్విన ఫీడర్ కాలువపై దృష్టి సారించారు. ఇది అత్యంత కీలకమైనది. పదిహేనేళ్ల క్రితం దాన్ని తవ్వి వదిలేయడంతో అనేకచోట్ల కట్టలు తెగిపోయాయి. మధ్యలో మేటవేసి, భారీ రంధ్రాలు పడి ధ్వంసమై ఒకరకంగా నీటి పారుదలకు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరి ఉన్న విషయాన్ని గుర్తించారు. దీంతో మొత్తం కాలువను ఆధునికీకరణ చేయక తప్పదని గుర్తించగా అందుకోసం రూ.476 కోట్లు అవసరంగా ప్రాజెక్టు అధికారులు నివేదించారు.
టెండర్లు పూర్తి
సుమారు 21 కి.మీ ఉండే ఫీడర్ కాలువ అడుగుభాగం మొత్తంతోపాటు రెండు కట్టల వైపు ఏటవాలు ప్రాంతం అంతా లైనింగ్ చేయ డంతోపాటు ఇప్పటికే తెగిపోయిన, భవిష్యత్‌లో అలాంటి అవకాశం ఉన్న మూడుచోట్ల 5.20 కి.మీ రెండు వైపులా కాంక్రీటు గోడల నిర్మాణ పనులు ఇందులో ప్రతిపాదించారు. ఆ పనులకు గత సెప్టెంబరు ఆఖరులో ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు ఇవ్వగా అనంతరం అధికారులు టెండర్లు పిలిచారు. పనులు మంజూరు చేసిన రూ.476కోట్లలో జీఎస్‌టీ, ఇతర టాక్స్‌లు పోను రూ.375 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. సుమారు ఐదుశాతం అధిక మొత్తంతో కేఎంవీఎల్ అనే జాయింట్ వెంచర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. నవంబరు ఆఖరుకు టెండర్ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆ వెంటనే పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలను వారు చేపట్టారు.
రెండు ప్లాంట్లు సిద్ధం
ప్రధానంగా పని ప్రదేశానికి దగ్గరలో రెండు బ్యాచింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. కాలువ లైనింగ్ కోసం లక్ష, 5.2కేఎం గోడల నిర్మాణానికి సుమారు లక్షా 80వేల క్యూబిక్ మీటర్లు వెరసి 2.80లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు అవసరంగా అంచనా వేశారు. అందుకోసం రోజుకు 1,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును మిక్సింగ్‌ను సిద్ధం చేయగలిగిన రెండు బ్యాచింగ్ ప్లాంట్లను గంటవానిపల్లి దగ్గర ఇప్పటికే ఏర్పాటు చేశారు. సుమారు 150 టన్నుల సిమెంట్‌ను నిల్వ చేసే సామర్థ్యం ఉన్న పెద్ద సైలోన్(బాయిలర్ వంటి) 100 టన్నుల సామర్థ్యం ఉండే మెటల్, శాండ్‌చిన్లను ఆ ప్లాంట్‌లో నిర్మాణం చేశారు. ఆ మూడింటి నుంచి ఏకకాలంలో సిమెంట్ కంకర, ఇసుక వచ్చి ఒకచోట కలిసి మిక్సింగ్ చేయడం, దాన్ని భారీ ట్యాంకర్లలో నింపడం అంతా సాంకేతిక పరిజ్ఞానంతో చేసేలా బ్యాచింగ్ ప్లాంట్లు సిద్ధం చేశారు. అలా చేసిన మిక్సింగ్ కాంక్రీటును వాహనాలతో తీసుకెళ్లి ఒకేసారి కాలువలో పనికి వాడతారు. ఒక్కో ప్లాంట్ నుంచి గంటకు 80 క్యూబిక్ మీటర్ల వంతున రోజుకు 15 గంటలపాటు మిషన్ పనిచేయడం ద్వారా 1,200 క్యూబిక్ మీటర్లు సిద్ధం చేయవచ్చు. అలా రెండు ప్లాంట్లతో రోజుకు 2,400 క్యూబిక్ మీటర్లు మిక్సింగ్‌కు అవకాశం ఉండగా సాధారణంగా మిషన్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు పరిగణనలోకి తీసుకొని కనీసం రెండువేల క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా మిక్సింగ్ కాంక్రీటు తయారీ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం వస్తే వెంటనే ప్రారంభం
కాలువ ప్రారంభంలో ఇంచుమించు 5కి.మీ వరకు సమీపంలోని గంటవానిపల్లి వద్ద ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయగా 18వ కి.మీ వద్ద 30 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు తయారీ చేసే మరో ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలో సీఎం వచ్చి భూమిపూజ చేస్తే తక్షణం కాంక్రీటు పనులు చేపట్టేలా అవసరమైన వివిధ రకాల మెటీరియల్, సిబ్బందిని సిద్ధం చేయగా సీఎం పర్యటన వాయిదాపడింది. అయితే కొద్దిరోజుల వ్యవధిలోనే తిరిగి సీఎం వచ్చే అవకాశం ఉండటంతో ఆ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక భాగం కాలువ కట్టలపై రాకపోకలకు వీలులేకుండా ఉండటంతో జంగిల్ క్లియరెన్స్, కట్టల చదును, ఇతరత్రా పనులను కూడా పూర్తి చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కాలువ పనులు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ అబుత్‌ఆలీ చెప్పారు.