Share News

ఫీడర్‌ కెనాల్‌ రెడీ

ABN , Publish Date - Aug 20 , 2026 | 02:18 AM

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి నీటి తరలింపులో కీలకమైన ఫీడర్‌ కెనాల్‌ సిద్ధమైంది. రూ.450 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొల్లంవాగు నుంచి టన్నెళ్ల ద్వారా వచ్చే నీరు కొత్తూరు వద్ద ఫీడర్‌ కెనాల్‌కు చేరి ఎటువంటి అవరోధం లేకుండా నల్లమల జలాశయంలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

ఫీడర్‌ కెనాల్‌ రెడీ
లైనింగ్‌ పనుల అనంతరం ప్రస్తుతం ఫీడర్‌ కెనాల్‌

నాడు వైసీపీ నిర్లక్ష్యం.. నేడు కూటమి నిర్మాణాత్మకం

రూ.450 కోట్లతో పనులు

నీటి పారుదలకు సిద్ధమైన వెలిగొండ ఫీడర్‌ కాలువ

పెద్దారవీడు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి నీటి తరలింపులో కీలకమైన ఫీడర్‌ కెనాల్‌ సిద్ధమైంది. రూ.450 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొల్లంవాగు నుంచి టన్నెళ్ల ద్వారా వచ్చే నీరు కొత్తూరు వద్ద ఫీడర్‌ కెనాల్‌కు చేరి ఎటువంటి అవరోధం లేకుండా నల్లమల జలాశయంలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. గత వైసీపీ ప్రభుత్వం ఫీడర్‌ కాలువను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ధిష్ట ప్రణాళికతో నిర్మాణాత్మకంగా ఫీడర్‌ కాలువను బలోపేతం చేసింది. త్వరలో నీటి విడుదలకు సిద్ధమైంది. దీంతో జిల్లా ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం వెలిగొండ ముఖ్య ఉద్దేశం. కృష్ణా జలాలను హెడ్‌ రెగ్యులేటర్ల నుంచి రెండు టన్నెళ్ల ద్వారా దోర్నాల మండలం కొత్తూరు వద్దకు చేరుస్తారు. ఆనీటిని అక్కడి నుంచి నల్లమల జలాశయానికి తరలించడంలో ప్రధాన భూమిక ఫీడర్‌ కెనాల్‌దే. దోర్నాల మండలం కొత్తూరు నుంచి పెద్దారవీడు మండలం కలనూతల వరకూ ఫీడర్‌ కెనాల్‌ సుమారు 24 కిలో మీటర్ల మేర ఉంది. ఈ కాలు వ బలోపేతంపై గత వైసీపీ ప్రభు త్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. నేడు ప్రజా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా నీటి పారుదలకు సిద్ధం చేసింది.

వైసీపీ నిర్లక్ష్యానికి తెగిన ఆనకట్ట

ఫీడర్‌ కెనాల్‌ను బలోపేతం చేసేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.120 కోట్లతో లైనింగ్‌ పనులు చేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. వీటిని పరిశీలిస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల పదవీ కాలంలో వైసీపీ ప్రభుత్వం ఫీడర్‌ కాలువ గురించి పట్టించుకోలేదు. దీంతో దోర్నాల మండలం కడపరాజుపల్లి వద్ద వర్షపు నీటికే గండ్లు పడ్డాయి. వాటిని పూడ్చేందుకు సైతం చర్యలు చేపట్టలేదు. ఎలాంటి పనులూ చేయండానే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు.

సిమెంట్‌ లైనింగ్‌తో కట్టలు బలోపేతం

2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి కృష్ణా జలాలను తరలించేందుకు నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్లింది. ఫీడర్‌ కాలువ బలోపేతానికి రూ.450 కోట్లతో నూతనంగా ప్రతిపాదనలు తయారు చేసి పనులను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీంతో ప్రస్తుతం ఫీడర్‌ కెనాల్‌లో బలహీనంగా ఉన్న కట్టలను సిమెంట్‌ లైనింగ్‌తో బలోపేతం చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట్ల బ్రిడ్జిలను నిర్మించారు. ఇప్పటికిప్పుడు కృష్ణా జలాలను వదిలినా కొత్తూరు వద్ద నుంచి నల్లమల సాగరానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జలాలు చేరేవిధంగా అంతా రెడీ చేశారు. నీటి విడుదల అనంతరం ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది.

Updated Date - Aug 20 , 2026 | 02:18 AM