గ్రానైట్ లారీలతో గడగడ
ABN , Publish Date - Aug 13 , 2026 | 02:55 AM
గ్రానైట్ లారీలు గడగడలాడిస్తున్నాయి. కనిగిరి వాసుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పట్టణ సమీపంలోని గార్లపేట రోడ్డులో ఉన్న గ్రానైట్ క్వారీలు, కటింగ్ యూనిట్ల నుంచి ప్రతిరోజూ వందల టన్నుల రాయిని భారీ లారీల్లో రవాణా చేస్తున్నారు.
పరిమితికి మించిన రాయితో రయ్.. రయ్..!
కనిగిరి పట్టణంలో నుంచే రవాణా
నిబంధనలకు విరుద్ధంగా తరలింపు
భయాందోళన చెందుతున్న ప్రజలు
ఛిద్రమవుతున్న రహదారులు
నిరంతరం ట్రాఫిక్‌కు అంతరాయం
అధికారుల చోద్యం చూస్తున్న అధికారులు
కనిగిరి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : గ్రానైట్ లారీలు గడగడలాడిస్తున్నాయి. కనిగిరి వాసుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పట్టణ సమీపంలోని గార్లపేట రోడ్డులో ఉన్న గ్రానైట్ క్వారీలు, కటింగ్ యూనిట్ల నుంచి ప్రతిరోజూ వందల టన్నుల రాయిని భారీ లారీల్లో రవాణా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పగటి వేళ ల్లోనే పట్టణ ప్రధాన రహదారుల నుంచి ఈ వాహ నాలు వెళ్తుండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనిగిరి సమీపంలోని గ్రానైట్ క్వారీల నుంచి శంఖవరం మీదుగా నేరుగా జాతీయ రహదాదికి లారీలు చేరే అవకాశం ఉన్నప్పటికీ అలా వెళ్లడం లేదు. భారీ లారీలు ఇందిరాకాలనీ, సాయిబాబా ఆలయం, సంజీవని ఆసుపత్రి, గార్లపేట బస్టాండ్, నగరికంటి బసవయ్య సెంటర్, పామూరు బస్టాండ్ మీదుగా పొదిలి రోడ్డుకు వెళ్తుండటంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, వ్యాపార సముదాయాలు, ఆసుపత్రులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల గుండా భారీ వాహనాలు దూసుకెళ్తుండటంతో ప్రతి క్షణం ప్రమాద భయం వెంటాడుతోంది. కొన్ని లారీల్లో వాహనం పొడవును మించి గ్రానైట్ రాళ్లను లోడ్ చేసి తరలిస్తున్నారు. అవి ఎక్కడ జారి పడతాయోనన్న భయంతో ఎదురుగా వచ్చే వాహనదారులు, బైకిస్టులు , పాదచారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓవర్‌లోడ్ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజీవని ఆసుపత్రి సమీపంలో భారీ లారీలు మార్గాన్ని దిగ్బంధించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు రోగులను ఆసుపత్రికి తీసుకురావడం లేదా ఇతర వైద్యశాలలకు తరలించడం చాలా కష్టతరంగా మారింది. ఇది రోగుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.
ఏడు శాఖల బాధ్యత మూడు శాఖలకే పరిమితమైన పర్యవేక్షణ
గ్రానైట్ క్వారీల నిర్వహణ, రవాణా అనుమతులు, భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ల సామర్థ్యం, కాలుష్య నియంత్రణ తదితర అంశాలపై మొత్తం 7 శాఖలు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం మైనింగ్, పోలీస్, రవాణా శాఖలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వారీల నిర్వహణ, రవాణాలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు స్పందించటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ లారీల రాకపోకల వల్ల రోడ్లు దెబ్బతినడంపై ఆర్‌అండ్‌బీ శాఖ కూడా మౌనం పాటిస్తోంది. వాహనాలు వెళ్లే మార్గమంతా దుమ్ము, ధూళి వ్యాపించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రహదారుల వెంట ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ రద్దీ ప్రాంతాల్లో పగటి వేళల్లో భారీ గ్రానైట్ లారీల రాకపోకలను పూర్తిగా నిషేధించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రవాణాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.