ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి.. తండ్రి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:17 AM
ద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత తండ్రి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన ఈనెల 19న ఒంగోలు ఏబీఎం కాలేజీ వద్ద జరిగింది. చికిత్స పొందుతున్న ఆద్య (10) చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో శనివారం మృతి చెందింది. ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కుమార్తె మృతి, కుమారుడి పరిస్థితి విషమం
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తండ్రి
భార్యాభర్తల మధ్య విభేదాలే కారణం
ఒంగోలు క్రైం, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత తండ్రి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన ఈనెల 19న ఒంగోలు ఏబీఎం కాలేజీ వద్ద జరిగింది. చికిత్స పొందుతున్న ఆద్య (10) చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో శనివారం మృతి చెందింది. ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాలిక మృతితో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాలలోని సాయికాలనీలో నివాసం ఉండే ప్రవల్లిక, ఎస్‌ఎన్‌పాడు మండలం పేర్నమిట్టకు చెందిన కొరిశపాటి విజయకుమార్‌లు చీరాల వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నారు. 12ఏళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి 10 ఏళ్ల బాలిక ఆద్య, ఎనిమిదేళ్ల బాలుడు సుప్రీత్ ఉన్నారు. విజయ కుమార్ ఎలాంటి పనిచేయకుండా భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు ఇరువురికీ ఒంగోలు మహిళా పోలీ సు స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ విజయకు మార్ తీరులో మార్పు రాలేదు. దీంతో కొంతకాలంగా ప్రవ ల్లిక బిడ్డలను తండ్రి వద్ద వదిలివేసి ఒంగోలు స్త్రీశక్తి సదన్ లో ఉంటోంది. ఈనేపథ్యంలో విజయకుమార్ ఈనెల 19న ఇద్దరు పిల్లలను తీసుకొని ఒంగోలు వచ్చాడు. నగరంలోని ఏబీఎం కాలేజీ వద్ద కూల్‌డ్రింక్‌లో ఏదో పౌడర్ కలిపి పిల్లలిద్దరికీ తాగించి తాను కూడా తాగాడు. అనంతరం పిల్లలను స్త్రీశక్తి సదన్‌లో తల్లి ప్రవల్లిక వద్దకు తీసుకెళ్లి అక్కడ వదిలి విజయకుమార్ వెళ్లిపోయాడు. పిల్లలు నీరసపడి కళ్లు తిరుగుతున్నాయి అని తల్లితో చెప్పారు. కూల్‌డ్రింక్‌లో ఏదో పౌడర్ వేసి నాన్న తాగించాడని చెప్పడంతో వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించిన ప్రవల్లిక.. మెరుగైన వైద్యం కోసం చైన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో చేర్పించింది. బాలిక ఆద్య (10) చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. తండ్రి విజయకుమార్ ఈనెల 22న రిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. బాలిక మృతి సమాచారం అందుకున్న పోలీసులు శనివారం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విజయకుమార్‌ను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
విభేదాలే దారుణానికి కారణం
భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల వలన భర్తకు దూరంగా ప్రవల్లిక స్త్రీశక్తిసదన్‌లో మూడు నెలలుగా ఉంటోంది. దీంతో విజయకుమార్ పిల్లలిద్దరికీ కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి తాను కూడా తాగినట్లు పోలీసులకు వివరించాడు. తల్లి ప్రవల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ విజయకృష్ణ తెలిపారు. పిల్లలకు విషం ఇచ్చిన విజయకుమార్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.