వేగంగా గృహగణన
ABN , Publish Date - May 27 , 2026 | 03:28 AM
జిల్లాలో 2027 జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి చేపట్టిన కార్యక్రమం ఇప్పటికి 98 శాతం పూర్తయింది. వేసవి తీవ్రత అధికం గా ఉన్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎన్యుమరేటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే ప్రక్రియను చేపడుతున్నారు.
జిల్లాలో 98 శాతం పూర్తి
నెలాఖరు వరకు గడువు
10వేల ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్టు గుర్తింపు
మార్కాపురం, మే 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 2027 జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి చేపట్టిన కార్యక్రమం ఇప్పటికి 98 శాతం పూర్తయింది. వేసవి తీవ్రత అధికం గా ఉన్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎన్యుమరేటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే ప్రక్రియను చేపడుతున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 21 మండలాల్లోని గృహాలను 2,222 బ్లాకులుగా విభజించారు. ఈ బ్లాకు ల్లోని ఎన్యుమరేటర్లు అందరూ గణనలో పాల్గొంటున్నారు. తహసీల్దార్‌లు, ఎంపీడీ వోలు, పురపాలక సంఘాల్లో కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈనెలాఖరు నాటికి ఇళ్ల గణన కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 4,13,863 ఇళ్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేయగా ఇప్పటికే 4,06,824 గృహాల గణన పూర్తి చేశారు. ఆ వివరాలను బట్టి జిల్లా జనాభా 13,27,117 మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇళ్ల గణనలో భాగంగా ముందుగా అధికారులు స్వీయ గణనకుఇచ్చిన పిలుపుమేరకు 2,188 మంది వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఎన్యుమరేటర్లు వెళ్లిన సమయంలో జిల్లా మొత్తంమీద 10,180 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. వేసవి సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లడం, వలస వెళ్లిన కుటుంబాలు, ఇతరులు ఇలా తాళం వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద గృహగణన కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత జనగణన ప్రారంభించనున్నారు.