వేగవంతంగా ‘రైతన్నా మీకోసం’
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:22 AM
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ సర్వే రెండు జిల్లాల్లో వేగవంతంగా సాగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడి, అధిక రాబడిపై అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరణతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రోత్సాహం లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే.
ప్రారంభమైన రెండో విడత సర్వే
రేపటితో ముగియనున్న కార్యక్రమం
ఒంగోలు మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ సర్వే రెండు జిల్లాల్లో వేగవంతంగా సాగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడి, అధిక రాబడిపై అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరణతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రోత్సాహం లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. ఈనెల 16 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఇళ్లకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది వెళ్లి కలిసి ఆయా అంశాలపై వివరించడంతోపాటు సాగుకు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా తొలివిడత ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరిగింది. రెండో విడత సోమవారం ప్రారంభమైంది. బుధవారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రెండు జిల్లాల్లో కలిపి 3,36,034 రైతు కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. తొలివిడతలో 1,94,586 కుటుంబాలను కలిసి ప్రభుత్వ లక్ష్యాలను వివరించడంతోపాటు అభిప్రాయాలను సేకరించారు. తిరిగి సోమవారం రెండో విడత సర్వే ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలోని రైతు సేవా కేంద్రం యూనిట్‌గా ఈ ప్రక్రియ సాగుతోంది. సోమవారం సాయంత్రానికి రెండు జిల్లాల్లో కలిపి 2,47,332 కుటుంబాల సర్వేను పూర్తిచేశారు. అందలో రెండో విడత సోమవారం సాయంత్రానికి రెండు జిల్లాల్లో 52,746 కుటుంబాల సర్వే చేశారు. మిగిలిన కుటుంబాల సర్వేను మంగళ, బుధవారాల్లో పూర్తి చేయనున్నట్లు డీఏవో శ్రీనివాసరావు తెలిపారు.