Share News

శరవేగంగా..

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:42 AM

ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో ఈ పనులను చేపట్టగా నెలరోజుల వ్యవధిలోనే శరవేగంగా పూర్తిచేస్తున్నారు.

శరవేగంగా..
మర్రిపూడి మండలం సన్నమూరులో నిర్మించిన సీసీ రోడ్డు

జోరుగా ఉపాధి మెటీరియల్‌ కోటాతో రోడ్ల నిర్మాణం

ఉమ్మడి జిల్లాలో 202 గ్రామాల్లో 406 పనులు

అందుకోసం రూ.118 కోట్లు కేటాయింపు

ఇప్పటికే 156 పనులు పూర్తి, పురోగతిలో 250

మరో వారంలో పూర్తికి అధికారుల కసరత్తు

ఒంగోలు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో ఈ పనులను చేపట్టగా నెలరోజుల వ్యవధిలోనే శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో రూ.118 కోట్లతో 406 పనులను 202 గ్రామాల్లో అధికారులు మంజూరు చేశారు. పశ్చిమప్రాంత నియోజకవర్గాల్లో అధిక మొత్తం ఉన్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితమే ఈ తరహా పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ నిధులపై స్పష్టత లేక జాప్యం జరిగింది. చివరకు సంక్రాంతి నాటికి సుమారు రూ.60 కోట్ల విలువైన పనులను అధికారులు తొలుత మంజూరుచేయగా ఒక్కో గ్రామంలో పది పనులకు మించి చేయరాదన్న నిబంధనతో ఆగిపోయాయి. అనంతరం కేంద్రం దానిని 20 పనులకు పెంచింది. ఈ లోపు నిధులపై కూడా మరికొంత స్పష్టత వచ్చింది. సాధారణంగా డ్వామా ద్వారా అమలయ్యే మెటీరియల్‌ కోటా నిధులతో చేపట్టే పథకాల నుంచి కొంతమేర మిగులు నిధులు తేలాయి. దీంతో మొత్తం మెటీరియల్‌ కోటా నిధులను రోడ్లు, డ్రైన్లు ఇతరత్రా నిర్మాణాలకు ఖర్చు చేయాలని ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు భావించారు.

ఈనెల 15నాటికి పూర్తిచేయాలి

202 గ్రామాల్లో రూ.118 కోట్లతో 406 పనులను గతనెలలో మంజూరు చేశారు. ఇందులో 1,033 కి.మీ. సిమెంట్‌ రోడ్లు, మరో 60.8 కి.మీ. తారు రోడ్లు ఉన్నాయి. గతనెలలో ఆయా పనులు మంజూరు ప్రక్రియ ప్రారంభం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈనెల 15 నాటికి పూర్తిచేస్తేనే బిల్లులు వస్తాయి. దీంతో ఆలోపు పనులు పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే చేసిన పనులకు సకాలంలో బిల్లులు అప్‌లోడ్‌ చేయకపోతే చెల్లింపులు కష్టమని కూడా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో కలెక్టర్‌ రాజాబాబు నిత్య పర్యవేక్షణలో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ అశోక్‌లు తమ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్కో పనికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించగా వాటిని క్షేత్రస్థాయిలోని అఽధికార పార్టీ నేతలు చేస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు కూడా పనులు పూర్తిపై దృష్టిసారించడంతో వారం పదిరోజులుగా శరవేగంగా సాగుతున్నాయి. మంజూరైన 406 పనుల్లో 256 ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. మొత్తం 103 కి.మీ సిమెంట్‌ రోడ్లలో 72.97 కి.మీ, అలాగే 60.8 కి.మీ తారురోడ్లలో 39.12 కి.మీ ఇప్పటివరకు పూర్తయినట్లు సమాచారం. పూర్తైన పనుల్లో అధిక భాగం ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి బిల్లులు కూడా అప్‌లోడ్‌ చేశారు. అలా ఇప్పటివరకు రూ.31.59 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. మిగిలిన పనులను రానున్న వారం పదిరోజుల్లో పూర్తిచేసి ఈనెల 15 నాటికి బిల్లులు ప్రక్రియ కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించుకొని చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 01:42 AM