రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:08 AM
రైతు ల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడినా రైతులు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన కిసాన్ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి ఎకరంలో పంట సాగు కావాలి
కరువు పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకెళ్లాలి
కిసాన్ సమ్మేళనంలో మంత్రి డాక్టర్ స్వామి
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రైతు ల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడినా రైతులు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన కిసాన్ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా రాష్ట్రంలో ఒక్క ఎకరం పొలాన్ని కూడా విత్తనం వేయకుండా వదిలేయకూడదనేది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఆధునిక సేద్యపు పద్ధతులపై అవగాహన కల్పించా ల్సిన బాధ్యత వ్యవసాయశాఖపై ఉందన్నారు. లోటు వర్షపాతం నమోదైనా రైతులు అధైర్యపడొద్ద న్నారు. భూమిలో సరిపడా తేమ లేకపోయినా వర్షం పడగానే మొలకెత్తేలా ప్రత్యేకంగా కోటింగ్ చేసిన పీఎం సీడ్స్ చల్లడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పంపిణీ చేసే ప్రత్యామ్నాయ విత్తనాల ద్వారా వచ్చే దిగుబడులను బై-బ్యాక్ పాలసీ కింద ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. లోగ్రేడ్ పొగాకుకు ప్రభుత్వం రూ.94 కోట్లు విడుదల చేసి ఆదుకున్నదన్నారు. అదనపు పొగాకు పంటపై ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సీఎం ప్రత్యేక దృష్టిసారించి కేంద్రంతో చర్చించి ఉత్తర్వులు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలతోపాటు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ .14వేలు కలిపి ప్రతి రైతు కుటుంబానికి రూ.20వేలు ఇస్తున్నదని మంత్రి స్వామి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు నీటిని గుండ్లకమ్మ, పాలేరు రిజర్వాయర్లకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. జేసీ కల్పనాకుమారి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాతావరణం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిఽధ్యకరణ వైపు మొగ్గుచూపాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, డీఏవో ఎస్.శ్రీనివాసరావు, డీహెచ్‌వో గోపీచంద్, ఆత్మ పీడీ రత్నమంజుల, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అనంతరం రైతులకు పంటల సాగుపై శాస్త్రవేత్తలు పలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి స్వామి పరిశీలించారు.