Share News

అండర్‌పాస్‌పై రైతుల ఆందోళన

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:01 PM

బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్‌ఫీల్డ్‌ నిర్మాణంలో ఉన్నతాధికారులు అవగాహన లేమి రైతులకు శాపంగా మారనుంది. భవిష్యత్‌లో తలెత్తే సమస్యను గుర్తించిన రైతులు ఇప్పటికే పలుమార్లు హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు దృష్టికి తీసుకుపోయినా ‘మా దారి మాదే’ అన్నట్లు వ్యవహరిస్తుండటం వారికి ఆగ్రహం తెప్పించింది.

అండర్‌పాస్‌పై రైతుల ఆందోళన
రోడ్డుపై టెంట్‌ వేసి నిరసన తెలుపుతున్న రైతులు

కొటికలపూడి వద్ద నిర్మించాలని డిమాండ్‌

విశాలమైన డొంక దారిలో చిన్న బాక్స్‌ కల్పర్ట్‌తో సరిపెట్టేందుకు ఏర్పాట్లు

తరచూ పనులు అడ్డుకుంటున్నా, మంత్రి రవికుమార్‌ ఉన్నతాధికారులతో మాట్లాడినా మారని పంథా

నిర్మాణం పూర్తయ్యాక పంటలను ఇళ్లకు ఎలా తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్న అన్నదాతలు

అద్దంకి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి) : బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్‌ఫీల్డ్‌ నిర్మాణంలో ఉన్నతాధికారులు అవగాహన లేమి రైతులకు శాపంగా మారనుంది. భవిష్యత్‌లో తలెత్తే సమస్యను గుర్తించిన రైతులు ఇప్పటికే పలుమార్లు హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు దృష్టికి తీసుకుపోయినా ‘మా దారి మాదే’ అన్నట్లు వ్యవహరిస్తుండటం వారికి ఆగ్రహం తెప్పించింది. మంగళవారం రోడ్డు నిర్మాణపనులను అడ్డుకుని నిరసన తెలిపారు.

మండలంలోని కొటికలపూడి గ్రామం వద్ద అద్దంకి-ధేనువకొండకు పురాతనడొంక దారి ఉంది. గతంలో అద్దంకికి పలు గ్రామాల ప్రజలు ఈ దారి గుండా రాకపోకలు సాగించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నిర్మాణంతో అద్దంకి పట్టణంతో ధేనువకొండ డొంకకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఆ డొంక నుంచి ఇప్పటికీ పలు గ్రామాల రైతులు తమ పొలాలకు రాకపోకలు సాగించేందుకు ప్రధాన మార్గంగా ఉంది. బీకేవీ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు సర్వే సమయంలో అధికారులు విశాలమైన ధేనువకొండ డొంకలో భాగంగా కొటికలపూడి సమీపంలో బాక్స్‌ కల్వర్ట్‌ ప్రతిపాదించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సమయంలో బాక్స్‌ కల్వర్టు నిర్మాణం జరగబోతున్నట్లు గుర్తించి కొటికలపూడి సర్పంచ్‌ పూనాటి విక్రమ్‌ ఆధ్వర్యంలో పలువురు రైతులు ఈ సమస్యను విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి తీసుకుపోయారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. అయినా ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా నిర్మాణ పనులు చేసేందుకు సిద్ధం అవుతుండటంతో ఐదారు నెలల కాలంలో కొటికలపూడి రైతులు పలుమార్లు రోడ్డు పనులను అడ్డుకున్నారు. ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఎదో ఒకటి చెప్తూ పనులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నదిపై బ్రిడ్జి పనులు ప్రారంభమవడంతోపాటు సమీపంలో రోడ్డు పనులు చివరి దశకు చేరాయి. ఈ క్రమంలోనూ ఉన్నతాధికారుల నుంచి, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధుల నుంచి ఎలాంటి సరైన సమాధానం రాకపోవటంతో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్‌లు అడ్డుపెట్టి పనులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణానికి వాహనాలు, మిషనరీ రాకపోకలు సాగించకుండా రోడ్డుపై టెంట్‌ వేశారు. బాక్స్‌ కల్వర్టు స్థానంలో సుబాబుల్‌ ట్రాక్టర్‌లు, వరిగడ్డి ట్రాక్టర్‌లు రాకపోకలు సాగించే విధంగా అండర్‌పాస్‌ నిర్మాణం చేయాలని రైతులు కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం సర్పంచ్‌ పూనాటి విక్రమ్‌, కోట శివరామయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, చందలూరి రామాంజనేయులు, కోవి గోపాలస్వామి, కొల్లి ఆంజనేయులు, కంచర్ల రవి, కమ్మ మల్లికార్జున తదితరులు పనులు అడ్డుకున్నారు. అండర్‌పాస్‌ నిర్మాణం చేసే వరకు రోడ్డు నిర్మాణ పనులు జరగనివ్వమని తేల్చిచెప్పారు.

Updated Date - Feb 03 , 2026 | 11:01 PM