రైతు చెంతకు యంత్రాంగం
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:00 AM
రెండు విడతలుగా ఆరు రోజులపాటు జరగనున్న ‘రైతన్నా మీకోసం’ సోమవారం ప్రారంభమైంది. పూర్వపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 528 రైతు సేవా కేంద్రాలు ఉండగా అన్నింటిలోనూ వ్యవ సాయ అనుబంధ శాఖల సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలకు అను గుణంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
పూర్వపు జిల్లావ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం’ ప్రారంభం
ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు వివరణ
రైతుల ఆలోచనల స్వీకరణతో సాగిన కార్యక్రమం
ఒంగోలు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రెండు విడతలుగా ఆరు రోజులపాటు జరగనున్న ‘రైతన్నా మీకోసం’ సోమవారం ప్రారంభమైంది. పూర్వపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 528 రైతు సేవా కేంద్రాలు ఉండగా అన్నింటిలోనూ వ్యవ సాయ అనుబంధ శాఖల సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలకు అను గుణంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధా నంగా తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించారు. పంటల సాగు విషయంలో రైతుల ఆలోచనలు, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 528 ఆర్‌ఎస్‌కేలలో 2,65,547 రైతు కుటుంబాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి మండలాల వారీగా వివరాలు ఇక్కడి అధికారులకు అందాయి. రెండు విడతలుగా ఆరు రోజుల పాటు అన్ని కుటుంబాలను సందర్శించాలని ఆదేశించారు. తదనుగుణంగా రోజుకు 44,257 కుటుంబాలను కలిసే విధంగా ఇక్కడి అధికారులు నిర్దేశించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం వరకు 21,868 (49శాతం) కుటుంబాలను కలిశారు. రాత్రి 8గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. నాగులుప్పలపాడు మండలం కె.తక్కెళ్ళపాడులో జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) ఎస్.శ్రీనివాసరావు పాల్గొని రైతులతో సమావేశమయ్యరు. ఇతరప్రాంతాల్లోనూ వివిధ స్థాయిల్లోని అధికారులు పర్యవేక్షించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబులు వారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలివిడత కార్యక్రమం నేడు, రేపు కొనసాగనుంది. రెండో విడత 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు.