ఫార్మర్ రిజిస్ట్రీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 03:05 AM
రైతు పథకాల అమలులో నకిలీల తొలగింపు, అనర్హుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటల్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇవ్వనుంది.
ప్రతి రైతుకూ గుర్తింపు సంఖ్య
ఆధార్ తరహాలో 11 అంకెలతో ప్రత్యేక కార్డు
వ్యవసాయ పథకాల వర్తింపునకు ఇక నుంచి అదే కీలకం
తొలిగా పీఎం కిసాన్ యాక్టివ్ లబ్ధిదారుల నమోదు
నిక్షిప్తం చేస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
ఫార్మర్ యాప్ ద్వారా సాగుపై అందుబాటులో పూర్తి వివరాలు
రైతు పథకాల అమలులో నకిలీల తొలగింపు, అనర్హుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటల్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇవ్వనుంది. ఒకరకంగా ప్రస్తుతం పౌరులకు ఉన్న ఆధార్ కార్డు తరహాలో వ్యవసాయానికి సంబంధించి ఇది ఉండనుంది. రైతులందరికీ సంబంధించిన ఆధార్ నెంబర్, భూమి వివరాలు ఉండే పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా నెంబరు, పంటల వివరాలను ఈ గుర్తింపు కార్డులో నమోదు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిం చిన ఈ ప్రక్రియను రాష్ట్రంలో వేగం గా అమలు చేస్తున్నారు. తదనుగు ణంగా జిల్లాలో ప్రస్తుతం ఫార్మర్ రిజిస్ట్రీ ముమ్మరంగా సాగుతోంది.
ఒంగోలు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసే పథకాల లబ్ధిలో ఇక నుంచి రైతు గుర్తింపు కార్డులు కీలకం కానున్నాయి. ఇందుకోసం ప్రతి రైతుకు ప్రత్యేకంగా ఆధార్ తరహాలో కార్డు ఇవ్వనున్నారు. అందుకు సంబంధించి ఫార్మర్స్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. తొలుత కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ లబ్ధిదారులకు దీనిని అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సుమారు 2.43 లక్షల మంది పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఉండగా అందులో 1,63,532 మంది యాక్టివ్ అని వ్యవసాయశాఖ కమిషనరేట్ పలు ప్రమాణికాలకు అనుగుణంగా గుర్తించింది. ఆ జాబితాను జిల్లాకు పంపించింది. తదనుగుణంగా జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నెల రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేస్తున్నారు. చాలావరకు పూర్తయినట్లు సమాచారం. మార్కాపురం జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 1,91,103 మంది ఉండగా ఇప్పటి వరకూ 1,19,351 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
కీలకం కానున్న కార్డు
క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఉన్న రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ చేస్తున్నారు. సంబంధిత రైతులు తమ ఆధార్ కార్డును, భూమికి సంబంధించిన పాసుపుస్తకాలను తీసుకెళితే వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక నుంచి రైతులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే వ్యవసాయ సంబంధ పథకాలకు ఈ గుర్తింపు కార్డులు కీలకం కానున్నాయి. ప్రధానంగా పీఎం కిసాన్ నిధులు, భారీ వ ర్షాలు, కరువు వల్ల జరిగిన నష్టాలకు ఇచ్చే ఇన్‌ఫుట్ సబ్సిడీ, వ్యవసాయ యంత్ర పరికరాలు, ఇతరత్రా అన్నింటి మంజూరుకు రైతు రిజిస్ట్రీ విధానంలో ఇచ్చే గుర్తింపు సంఖ్యతో ఉన్న కార్డు ప్రామాణికం కానుంది. అవి ఉన్నవారికే ఈ పథకాలు వర్తించే అవకాశం ఉంది. తొలుత పీఎం కిసాన్ లబ్ధిదారులకు చేస్తున్న రిజిస్ట్రేషన్ తర్వాత ఇతర అందరు రైతులకు చేయనున్నారు.
ఫార్మర్ యాప్‌తో ఎంతో మేలు
పంటల సాగుపై ప్రతి రైతుకు పూర్తి అవగాహన లక్ష్యంతో ఫార్మర్ యాప్‌ను ప్రభుత్వం తెచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంతో పంటల సాగు నుంచి మార్కెటింగ్ వరకు మొత్తం 15 రకాల వివరాలు ఈ యాప్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. రైతులకు చెందిన మొబైల్ ఫోన్‌లో ప్రస్తుతం వ్యవసాయశాఖ సిబ్బంది ఫార్మర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. జిల్లాలో లక్షా 14వేల మంది రైతులకు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్ణయించుకోగా ప్రక్రియ వేగవంతం చేసినట్లు సమాచారం.
అన్నిరకాల వివరాలు అందులోనే..
వాతావరణ పరిస్థితులు, ఏ ప్రాంతంలో ఏ పంట సాగుకు అనుకూలం, ఎరువుల వాడకం, చీడపీడల నివారణ, వివిధప్రాంతాల్లో పంట ఉత్పత్తులకు లభిస్తున్న ధరలు, ముఖ్యమైన వ్యవసాయశాఖ అధికారుల, శాస్త్రవేత్తల వివరాలు, రైతుల సక్సెస్ స్టోరీలు తదితర పలు రకాల వివరాలు ఫార్మర్ యాప్‌లో ఉండనున్నాయి. రైతులందరూ ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు కోరారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని సూచించారు.