నకిలీ పోలీస్.. నయా దందా
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:53 AM
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని యడవల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రదీప్ నకిలీ పోలీసు అధికారి అవతారమెత్తాడు. తాను సైబర్ వింగ్‌లో డీఎస్పీ స్థాయి అధికారి నని చెప్పి అందరికీ నమ్మబలికాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయిన బాధితులను లక్ష్యంగా చేసుకున్నాడు.
సైబర్ నేరాల ప్రత్యేక అధికారిగా అవతారం
పోలీస్ స్టేషన్‌లోనే పంచాయితీ
ఆయా కేసులలో బాధితులకు వల
భారీగా డబ్బు వసూలు
ఉద్యోగాల పేరుతోనూ మోసం
ఒంగోలు తాలూకా స్టేషన్‌లో కేసు నమోదు
ఒంగోలు క్రైం, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని యడవల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రదీప్ నకిలీ పోలీసు అధికారి అవతారమెత్తాడు. తాను సైబర్ వింగ్‌లో డీఎస్పీ స్థాయి అధికారి నని చెప్పి అందరికీ నమ్మబలికాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయిన బాధితులను లక్ష్యంగా చేసుకున్నాడు. పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పి స్తానని చెప్పి వారివద్ద భారీగా డబ్బులు వసూలు చేశా డు. పోలీసు శాఖలోని కొందరు అధికారులను సైతం తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సైబర్ నేరాలపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఆసమయంలో విద్యార్థులను పరిచయం చేసుకొని కల్లబొల్లి మాటలు చెప్పాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ప్రదీప్ నిజస్వరూపం బయటపడింది. ఈయనపై ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఈనెల 27న కేసు నమోదు చేశారు. విచారణలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాలూకా పోలీసు స్టేషన్‌లోనే ఆయన విషయమై పంచాయితీ చేసినట్లు కూడా తేలింది. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలోనూ ప్రదీప్ చేసిన మోసాలపై విచారణ జరుగుతోంది.
వెలుగులోకి వచ్చింది ఇలా..
ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడుకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని (బిట్‌కాయిన్‌లో) రూ.1.23కోట్ల మేర మోసపోయాడు. ఈమేరకు బాధితుడు దాదాపు 10 నెలల క్రితం ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రదీప్ రంగంలోకి దిగాడు. తాను సైబర్ నేరాలకు సంబంధించిన ప్రత్యేక అధికారినైనందున మోసపోయిన డబ్బులు మొత్తం తిరిగి ఇప్పస్తానని బాధితుడికి నమ్మబలికాడు. రూ.63లక్షలు సైబర్ నేరగాళ్ల నుంచి తిరిగి వచ్చినట్లు ఫేక్ బ్యాంక్ అకౌంట్లు కూడా చూపించాడు. మొత్తం డబ్బు వసూలుకు ఖర్చుల కింద బాధితుడి దగ్గర నుంచి రూ.5.5లక్షల గుంజాడు. అయితే నెలల తరబడి అతడికి నగదు జమ కాకపోవడంతో ఒత్తిడి పెంచాడు. బాధితుడికి నగదు ఇప్పించే విషయాన్ని ఓ పోలీసు అధికారి భుజాన వేసుకుని పోలీసు స్టేషన్‌లోనే పంచాయితీ చేసినట్లు సమాచారం. ఈ సమయంలో నకిలీ పోలీసు అధికారి ఒక ఒప్పందపత్రాన్ని కూడా బాధితుడికి రాసిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ప్రదీప్ డబ్బులు జమ చేయకుండా జాప్యం చేయడంతోపాటు తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్లు కాలయాపన చేశాడు. దీంతో బాధితుడు పోలీసు ఉన్నతాఽధికారులను కలిసి పూర్తి సమాచారం ఇవ్వడంతో వారి ఆదేశాలతో హడావుడిగా కొత్తపల్లి ప్రదీప్‌పై సోమవారం ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే బాధితుడు మాత్రం ఇటీవల కాలంలో తానేమీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పడం కొసమెరుపు. దీంతో పోలీసు శాఖలో అలజడి రేగింది. ఆయనకు రాచమర్యాదలు చేసిన వారిలో వణుకు మొదలైంది.