ప్రభుత్వ స్థలంపై కన్ను
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:53 AM
పొదిలిలో ఒంగోలు - నంద్యాల జాతీయ రహదారిని ఆనుకొని మార్కాపురం అడ్డురోడ్డులోని సర్వే నెంబరు 82-5లో 23 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దాని విలువ సుమారు రూ.3కోట్లకుపైమాటే. ఆ స్థలంపై గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల కన్ను పడింది.
కొట్టేసేందుకు సరికొత్త పన్నాగం
పొదిలిలో హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు
గత వైసీపీ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమణ
అప్పట్లో రంగంలోకి దిగిన కీలక ప్రజాప్రతినిధి సోదరుడు
గుర్తించి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
ఇప్పుడు తెరచాటు వ్యవహారం నడుపుతున్న ఆ నేత
పొదిలి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పొదిలిలో ఒంగోలు - నంద్యాల జాతీయ రహదారిని ఆనుకొని మార్కాపురం అడ్డురోడ్డులోని సర్వే నెంబరు 82-5లో 23 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దాని విలువ సుమారు రూ.3కోట్లకుపైమాటే. ఆ స్థలంపై గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల కన్ను పడింది. ఒక పథకం ప్రకారం ఆ స్థలాన్ని ఆనుకొని ఉన్న పట్టా భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసి వెంచర్ వేశారు. ఆతరువాత ప్రభుత్వ స్థలాన్ని కలుపుకునేందుకు చదును చేశారు. విషయాన్ని గుర్తించిన అప్పటి వైసీపీ నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి సోదరుడు రంగంలోకి దిగారు. ఆ స్థలాన్ని వదిలేయాలని రియల్ వ్యాపారిపై ఒత్తిడి చేశారు. ఆయన కాదనడంతో ఆగమేఘాలపై సర్వే చేయించి వారి ఆధీనంలో ఉన్న స్థలాన్ని వేరు చేయించారు. అప్పటి నుంచి దాన్ని ఆక్రమించుకునేందుకు ఆ వైసీపీ ప్రజాప్రతినిధి సోదరుడు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో ఆయన ఆక్రణలపై పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు ముందుకు వచ్చి ఆ 23 సెంట్లను ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు తరువాత సదరు స్థలంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అక్కడ హెల్త్ క్లినిక్ నిర్మిస్తే ఆ స్థలం తమకు దక్కకుండా పోతుందని భావించిన ఆ వైసీపీ నేత అడ్డుకునేందుకు పావులు కదిపారు. అక్కడ హెల్త్ క్లినిక్ నిర్మాణం వలన పర్యావరణం దెబ్బతింటుందని, సమీప వెంచర్లలోకి వెళ్లేందుకు దారి లేకుండాపోతుందని మండలానికి సంబంధం లేని ఐదుగురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ఎత్తుగడలో భాగంగానే సదరు వైసీపీ నేత ఇలా చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అక్కడ హెల్త్ క్లినిక్ నిర్మించడం వలన చుట్టూ ఉన్న సుమారు పది గ్రామాల ప్రజలకు వైద్యం అందుతుంది. అయితే అక్రమార్కులు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలకు ఎసరు పెట్టి తెరచాటు వ్యవహారం సాగిస్తుండటం చర్చనీయాంశమైంది.
అది ప్రభుత్వ స్థలం.. వెంచర్లకు దారి హక్కులు లేవు
కృష్ణారెడ్డి, పొదిలి తహసీల్దార్
అది ప్రభుత్వ స్థలం. ప్రైవేటు వెంచర్లకు వెళ్లేందుకు ప్రభుత్వం ఎలాంటి దారి హక్కులను కల్పించ లేదు. అక్కడ హెల్త్ క్లినిక్ నిర్మిస్తే ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ స్థలం మీదుగా సమీపంలో ఉండే ప్రైవేటు వెంచర్లకు దారి హక్కులు లేవంటూ ఏపీపీ ద్వారా కోర్టులో పిటిషన్ వేయనున్నాం.