Share News

అద్దంకిలో కంటి వైద్యం కరువు

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:14 PM

అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలలో కంటి పరీక్షలు చేసే అవకాశం లేకపోవటంతో ముఖ్యంగా వృద్ధులు అవస్థలు పడుతున్నారు. దశాబ్దకాలం పాటు అద్దంకి సీహెచ్‌సీలో కొనసాగిన విజన్‌ సెంటర్‌ ఏడాదిన్నర క్రితం రద్దయ్యింది.

అద్దంకిలో కంటి వైద్యం కరువు
అద్దంకి ప్రభుత్వ వైద్యశాల

అప్పట్లో ప్రతిరోజూ వంద మందికి పరీక్షలు

గత టీడీపీ ప్రభుత్వహయాంలో ముఖ్యమంత్రి ఐ సెంటర్‌ ఏర్పాటు

వైసీపీ వచ్చాక దానిని ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగింత

గడువు ముగియడంతో విజన్‌ సెంటర్‌ రద్దు

వృద్ధులకు అవస్థలు

అద్దంకి, జనవరి 29(ఆంధ్రజ్యోతి) : అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలలో కంటి పరీక్షలు చేసే అవకాశం లేకపోవటంతో ముఖ్యంగా వృద్ధులు అవస్థలు పడుతున్నారు. దశాబ్దకాలం పాటు అద్దంకి సీహెచ్‌సీలో కొనసాగిన విజన్‌ సెంటర్‌ ఏడాదిన్నర క్రితం రద్దయ్యింది. వైద్యశాఖలో క్లస్టర్‌ వ్యవస్థ ఉన్న సమయంలో అద్దంకి సీహెచ్‌సీలో కంటి వైద్య పరీక్షల కోసం సిబ్బందిని కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వం కంటి వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి ఐసెంటర్‌ను ప్రారంభించింది. అదేసమయంలో కూడలిగా ఉన్న అద్దంకి సీహెచ్‌సీలో ఐవిజన్‌ సెంటర్‌ను నిర్వహించారు. క్లస్టర్‌ వైద్యశాలలో పనిచేసే కంటి పరీక్షలు నిర్వహించే సిబ్బందిని కేటాయించారు. దీంతో అద్దంకి, దర్శి నియోజకవర్గాలలోని పలుగ్రామాల నుంచి కంటి పరీక్షలకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు ప్రతిరోజూ సుమారు వంద మందికి పైగా వృద్ధులు వచ్చి పరీక్షలు చేయించుకునేవారు. ఒకదశలో అద్దంకిలో కంటి పరీక్షలు చేయించుకోవాలంటే కనీసం రెండు, మూడు రోజులు ముందుగానే అపాయింట్‌మెంట్‌ తీసుకునే పరిస్థితి నడిచింది.


వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో అప్పగింత

అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సిబ్బందిని మార్పుచేసి ఆ సెంటర్‌ నిర్వహణను కాంట్రాక్ట్‌ పద్ధతిలో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్‌ ఏజెన్సీ గడువు ముగియటంతో అన్నిచోట్ల ఉన్న కంటి పరీక్షా కేంద్రాలు ఆటోమేటిక్‌గా రద్దయ్యాయి. పూర్వం మారుమూల పీహెచ్‌సీలలో ఉన్న కంటి వైద్య సిబ్బంది పోస్టులను అదే పీహెచ్‌సీలలో కొనసాగిస్తున్నారు. దీంతో మారుమూల పీహెచ్‌సీలకు వెళ్లేందుకు సరైన రవాణా వసతి లేక ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్తున్నారు. ఈ వైద్యశాలలో చిన్న పరీక్షలకు కూడా వేలకు వేల రూపాయలు చెల్లించాల్సి రావటంతో పలువురు వృద్ధులు మిన్నకుంటున్నారు.

అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరు పీహెచ్‌సీలో కంటి పరీక్షలకు సిబ్బంది ఉన్నా సమీప గ్రామాల నుంచి మాత్రమే వృద్ధులు వెళ్తున్నారు. దర్శి నియోజకవర్గంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలలో కంటి వైద్యానికి ప్రత్యేకంగా సర్జన్‌ పోస్టు కూడా ఉంది. అదేసమయంలో కురిచేడు, దొనకొండ, తాళ్ళూరు పీహెచ్‌సీలలో కంటి పరీక్షలకు సిబ్బంది ఉన్నారు. అద్దంకి నియోజవకర్గంలో ఒక్క సంతమాగులూరులో మాత్రమే కంటి పరీక్షలు చేసే సిబ్బంది ఉన్నారు. ఈనేపథ్యంలో కూడలిగా ఉన్న అద్దంకి పట్టణంలోని సీహెచ్‌సీలో కంటి వైద్యం అందించేందుకు సర్జన్‌ పోస్టు మంజూరు చేయటంతో పాటు తాత్కాలికంగా గతంలో వలే ఒకరు సిబ్బందిని కంటి పరీక్షలకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:14 PM