ప్రైవేటులో ఖరీదైన వైద్యం.. జీజీహెచ్‌లో విజయవంతం
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:02 PM
ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు చెల్లిస్తేగాని జరగని ఆపరేషన్లు ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో ఉచితంగా, విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు చెప్పారు.
ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు చెల్లిస్తేగాని జరగని ఆపరేషన్లు ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో ఉచితంగా, విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు చెప్పారు. గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లోని న్యూరాలజీ విభాగం.. మరోసారి అరుదైన నరాల వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు విజయవంతంగా చికిత్స అందించినట్లు చెప్పారు. సింగరాయకొండకు చెందిన షౌకత్ ఆలీ కార్టికోబేసల్ సిండ్రోమ్ అనే అరుదైన నరాల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారన్నారు. అలాగే మేదరమెట్లకు చెందిన కల్పన, ఒంగోలుకు చెందిన శైలజ అనే మరో మహిళ డెవిక్స్ డిసీజ్ అనే తీవ్రమైన నరాల వ్యాధితో చికిత్స కోసం జీజీహెచ్‌కు విచ్చేసినట్లు తెలిపారు. ఇందులో శైలజకు ఈ వ్యాధి మూడోసారి వచ్చిందన్నారు. దీంతో రోగుల అనారోగ్య తీవ్రతను గుర్తించిన ఆసుపత్రి వైద్యులు న్యూరాలజిస్ట్ హరి ఆధ్వర్యంలో వైద్య బృందం క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయంతం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఇదే వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. హైడోస్ స్టెరాయిడ్స్ అందించడంతోపాటు, ప్లాస్మా ఎక్చేంజ్ ద్వారా రక్తంలోని హానికర యాంటీబాడీలను తొలగించామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరి బృందాన్ని ఆసుపత్రి వైద్యులు అభినందించారు. మీడియా సమావేశంలో సీఎ్‌సఆర్‌ఎంవో డాక్టర్ మాధవీలత, ఏఆర్‌ఎంవో డాక్టర్ సునీల్ గవాస్కర్‌తోపాటు, వ్యాధి నుంచి కోలుకున్న రోగులు పాల్గొన్నారు.