Share News

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి కసరత్తు

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:33 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు ఎయిడెడ్‌ హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో స్వీకరించిన దరఖాస్తులను తమకు అప్పగిస్తే సీబీటీ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు ఆయా పాఠశాలల యాజమాన్యాలను కోరుతున్నారు.

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి కసరత్తు

దరఖాస్తుల సేకరణలో అధికారులు

సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహణ

ఒంగోలు విద్య, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు ఎయిడెడ్‌ హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో స్వీకరించిన దరఖాస్తులను తమకు అప్పగిస్తే సీబీటీ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు ఆయా పాఠశాలల యాజమాన్యాలను కోరుతున్నారు. అధికారికంగా దరఖాస్తుల కోసం యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏబీఎం హైస్కూల్‌, జె.పంగులూరు మండలం ముప్పవరం పీఎన్‌అండ్‌సీసీ హైస్కూల్‌, చీరాల ఎంఎన్‌ హైస్కూల్‌, కనిగిరి చిత్తరంజన్‌ అరబిక్‌ ఓరియంటల్‌ హైస్కూల్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్‌ పోస్టులు ఇస్తారు. ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆఫ్‌లైన్‌ బదులు ఆన్‌లైన్‌

టీచర్ల ఎంపికకు గతంలో ఆఫ్‌లైన్‌లో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేవారు. ఆ విధానానికి బదులుగా కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు అభ్యర్థులకు పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షకు హాల్‌టికెట్లు కూడా విద్యాశాఖ కమిషనరు కార్యాలయమే జారీ చేస్తుంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నాలుగు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన హైకోర్టు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించకుండా పంపాలని ఆదేశించింది. ఈ నేపఽథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు తుది ఉత్తర్వుల మేరకు ఫలితాలు ప్రకటించి అర్హులైన వారికి నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఈ నెలాఖరులోపు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాలన్న పట్టుదలతో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఆఫ్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను యాజమాన్యాలు విద్యాశాఖ అధికారులకు సమర్పించకపోతే తమ వద్ద ఉన్న ఆన్‌లైన్‌ దరఖాస్తుదారులకే పరీక్ష నిర్వహించాలని కమిషనర్‌ కార్యాలయం ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.

Updated Date - Jan 24 , 2026 | 01:33 AM