Share News

జడ్పీలపై కసరత్తు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:35 AM

ప్రకాశం జడ్పీ చైర్మన్‌ పదవిపై టీడీపీ అధిష్ఠానం నిశిత పరిశీలన ప్రారంభించింది. ఆ పార్టీ తరఫున ఎస్సీల నుంచి జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన ఏడుగురి అర్హతలను లోతుగా పరిశీలిస్తోంది. మరోవైపు వైస్‌ చైర్మన్‌ పదవికోసం కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

జడ్పీలపై కసరత్తు

ప్రకాశం చైర్మన్‌ పదవికి ఏడుగురి అర్హతలపై పరిశీలన

వైస్‌చైర్మన్‌ కోసం పోటాపోటీ

ముండ్లమూరు, టంగుటూరు నుంచి పెరిగిన ఒత్తిడి

మార్కాపురంలో రామిరెడ్డికి ఓకే

కనిగిరి, గిద్దలూరు నుంచి వైస్‌చైర్మన్‌కు చాన్స్‌

ఎంపీపీ పదవులపై ముందే నిర్ణయం తీసుకున్న నేతలు

ప్రకాశం జడ్పీ చైర్మన్‌ పదవిపై టీడీపీ అధిష్ఠానం నిశిత పరిశీలన ప్రారంభించింది. ఆ పార్టీ తరఫున ఎస్సీల నుంచి జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన ఏడుగురి అర్హతలను లోతుగా పరిశీలిస్తోంది. మరోవైపు వైస్‌ చైర్మన్‌ పదవికోసం కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్మన్‌ ఎంపికపై ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడిన మంత్రి రవికుమార్‌ మంగళవారం రాత్రి లేక బుధవారం ఉదయం మరో మంత్రి స్వామితో కలిసి జిల్లా నాయకులతో చర్చించనున్నారు. కాగా వైస్‌చైర్మన్‌ పదవి కోసం అగ్రవర్ణాల నుంచి గెలుపొందిన జడ్పీటీసీలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. మార్కాపురం జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి పేరు ఖరారైంది. అక్కడ వైస్‌చైర్మన్‌ పదవిని తన నియోజకవర్గానికి తెచ్చుకునేందుకు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి చక్రం తిప్పుతున్నారు. రెండు జిల్లాల్లో మొత్తం 48 మండల పరిషత్‌లను చేజిక్కించుకునే అవకాశం టీడీపీకే దక్కగా ఎంపీపీల ఎంపిక ఇప్పటికే దాదాపు పూర్తయింది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక ఈనెల 19, 20 తేదీలలో పూర్తికానుంది. ముందుగా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఉంటుంది. జిల్లా పరిషత్‌లో మైనారిటీల నుంచి ఇద్దరు, జనరల్‌ కేటగిరీ నుంచి ఒకరు మొత్తం ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మండల పరిషత్‌లకు ఒక్క కోఆప్షన్‌ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంది. మండలాల్లో ఈనెల 19న ఉదయం కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక, సాయంత్రం మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. 20న జడ్పీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లఎన్నిక నిర్వహించనున్నారు.

ఆ ఏడుగురిలో అదృష్టం ఎవరిని వరించేనో?

ప్రకాశం జిల్లాలో 27 జడ్పీటీసీలకుగాను 23ను టీడీపీ, రెండింటిని జనసేన దక్కించుకున్నాయి. రెండు చోట్ల వైసీపీ గెలిచింది. జడ్పీ చైర్మన్‌ పదవి టీడీపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేయాలని ఇన్‌చార్జి మంత్రి రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు రవికుమార్‌, స్వామి, పార్టీ ఎన్నికల పరిశీలకుడు రాంగోపాల్‌రెడ్డిని అధిష్ఠానం ఆదేశించింది. ఆ నలుగురు ప్రాథమికంగా చర్చించుకున్నారు. మంత్రి స్వామి విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కావడంతో అక్కడ జరగనున్న పారిశ్రామిక సదస్సు బిజీలో మునిగిపోయారు. దీంతో రవికుమార్‌ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌కు ఫోన్‌ చేసి జడ్పీటీసీలుగా గెలుపొందిన దళితులపై పరిశీలన చేయాలని సూచించారు. ఆ తర్వాత రాత్రికి ఆయన మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు. జిల్లాలో 8 జడ్పీటీసీలు దళితులకు రిజర్వ్‌ కాగా ఏడుచోట్ల టీడీపీ, కొండపిలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ నుంచి గెలుపొందిన వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మహిళల్లో అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరు నుంచి గెలుపొందిన సందిపోగు సుభాషిణి పేరును కూడా పరిశీలించారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి రవికుమార్‌ మంత్రిగా ఉండటంతో వేరే నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించినట్లు తెలిసింది. కొండపి నియోజకవర్గంలో మర్రిపూడి, పొన్నలూరు నుంచి గెలుపొందిన వారిలో మర్రిపూడి జడ్పీటీసీ రాజా పేరును పరిశీలించారు. అయితే కొండపి నుంచి కూడా మంత్రి స్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నందున పక్కనపెట్టి వేరే నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కందుకూరు నియోజకవర్గంలోని వీవీపాలెం నుంచి కోరుకొండ అంజిబాబు, కందుకూరు నుంచి రెబ్బవరపు మాల్యాద్రి గెలుపొందారు. వీరిలో అంజిబాబు పేరును ప్రారంభంలోనే ఎమ్మెల్యే నాగేశ్వరరావు సిఫార్సు చేశారు. విద్యాధికుడు, ఆర్థిక వనరులు కూడా సమకూర్చే అవకాశం ఉండటంతో పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఆయన ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారు. గతంలో టీడీపీలో చేరి మళ్లీ వెళ్లిపోయిన జూపూడి ప్రభాకరరావుతో అప్పట్లో టీడీపీలోకి రావడం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. రెబ్బవరపు మాల్యాద్రి మాదిగ సామాజికవర్గం అయినప్పటికీ విద్యార్హతలు తక్కువగా ఉన్నాయి.

పరిశీలనలో ప్రభాకరరావు పేరు

ప్రకాశం జడ్పీ చైర్మన్‌ పదవికి ఒంగోలు రూరల్‌ నుంచి గెలుపొందిన ప్రభాకర రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ఆయన గతంలో సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, ఏఎంసీ డైరెక్టర్‌గా పనిచేసి ఉండటమేకాక ప్రస్తుతం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ ఎస్సీసెల్‌లో జిల్లా కమిటీలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. పైగా మాదిగ సామాజికవర్గం. దీంతో తొలి నుంచి పరిశీలనలో ఉన్న అంజిబాబు, ప్రభాకరరావులలో ఒకరికి చాన్స్‌ ఇస్తారా? లేక మహిళ వైపు మొగ్గుచూపుతారా? అనేది చూడాల్సి ఉంది. ఇటు పార్టీపరంగానే కాక టీడీపీ కార్యక్రమాలు చూసే ప్రైవేటు సంస్థ.. అభ్యర్థుల గుణగుణాలు, వారి అర్హతలు, లోపాలపై రాష్ట్ర పార్టీకి నివేదిక పంపింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని చైర్మన్‌ అభ్యర్థిని నిర్ణయిస్తారని సమాచారం.

వైస్‌చైర్మన్‌కు పెరిగిన డిమాండ్‌

ప్రకాశం జడ్పీ వైస్‌చైర్మన్‌ పదవికి పోటీ ఎక్కువైంది. చైర్మన్‌ పదవి దళితులకు రిజర్వ్‌ అయినందున వైస్‌చైర్మన్‌ పదవి అగ్రవర్ణాలకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. పక్కనే ఉన్న మార్కాపురం జిల్లా వైస్‌చైర్మన్‌ పదవిని బీసీలకు ఇచ్చి ప్రకాశం వైస్‌ చైర్మన్‌గా అగ్రవర్ణాలకు అవకాశం కల్పిస్తారని ఆలోచన. అగ్రవర్ణాలలో కమ్మ సామాజికవర్గం నుంచి గెలుపొందిన జడ్పీటీసీలు ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో ముండ్లమూరు జడ్పీటీసీ మందలపు సౌమ్య, కొండపి నియోజకవర్గం టంగుటూరు జడ్పీటీసీ ఈదర ప్రభాకర్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు జడ్పీటీసీ నాదెండ్ల పద్మజ కూడా రేసులో ఉన్నారు. ముండ్లమూరు జడ్పీటీసీ సౌమ్యకు అవకాశం ఇవ్వాలని దర్శి ఇన్‌చార్జి లక్ష్మి కూడా సూచించినట్లు తెలిసింది. సౌమ్య మామ మందలపు వెంకట్రావు పార్టీలో సీనియర్‌ నాయకులు. టంగుటూరు జడ్పీటీసీ ప్రభాకర్‌ కూడా పార్టీలో సీనియర్‌ నాయకుడు. ఆయనకు దామచర్ల కుటుంబ మద్దతు పుష్కలంగా ఉంది. చీమకుర్తి జడ్పీటీసీ కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. జనసేనకు వైస్‌చైర్మన్‌ పదవిని కేటాయింపజేసుకుని దర్శి నుంచి గెలుపొందిన తన సతీమణికి అవకాశం తెచ్చుకోవాలని జనసేన జిల్లా ఎన్నికల కమిటీసభ్యుడు నాగరాజు కూడా తన ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు.

మార్కాపురం జడ్పీ చైర్మన్‌గా రామిరెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌

మార్కాపురం జడ్పీ చైర్మన్‌ పదవి దోర్నాల నుంచి గెలుపొందిన కందుల రామిరెడ్డిని వరించనుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి రవికుమార్‌ సారథ్యంలో ఆ పార్టీ పరిశీలకుడు బీటీ నాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆయన పేరును సూచించడంతో అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ కూడా రామిరెడ్డికి పోలింగ్‌కు ముందే ఫోన్‌చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చారు. కాగా మార్కాపురం జిల్లాలో ఉన్న 21 జడ్పీటీసీలలో టీడీపీ 17, జనసేన 3 స్థానాల్లో, బీజేపీ 1 చోట గెలుపొంది క్లీన్‌స్వీప్‌ చేశాయి. అందువల్ల రామిరెడ్డి ఎన్నిక లాంఛనమే. వైస్‌చైర్మన్‌ పదవిని జనసేన కోరే అవకాశం కనిపిస్తోంది. జనసేన తరఫున ముగ్గురు జడ్పీటీసీలు గెలుపొందగా వారంతా కాపు సామాజికవర్గం వారే. టీడీపీ నేతలు మాత్రం బీసీలకు లేక దళితుల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందులోభాగంగా కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం నుంచి గెలుపొందిన శ్రీనివాసవర్మ పేరును, గిద్ద లూరు నియోజకవర్గం అర్థవీడు నుంచి గెలుపొందిన బండ్లమూడి ఆంజనేయులు పేరును పరిశీలిస్తున్నట్లు తెలి సింది. అయితే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసిం హారెడ్డి వైస్‌చైర్మన్‌ పదవిని కనిగిరికే కేటాయించాలని కోరుతూ అధిష్ఠానం వద్ద చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 11 , 2026 | 01:35 AM