పంచాయతీల రిజర్వేషన్లపై కసరత్తు
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:47 AM
గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో తదనుగుణంగా రిజర్వేషన్లను చేపట్టారు.
నేడు గెజిట్ విడుదలకు అవకాశం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో తదనుగుణంగా రిజర్వేషన్లను చేపట్టారు. జిల్లాలో 519 గ్రామపంచాయతీలు ఉండగా ఇప్పటికే కొండపికి పాలకవర్గం ఉంది. మంగమూరు, సర్వేరెడ్డిపాలెంలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒంగోలు రూరల్ మండలంలో రెండు దేవరంపాడులు కలిపి ఒక పంచాయతీగా ఏర్పడనుంది. దీంతో మిగిలిన 515 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రంలోపు గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి అనుపమ నేతృత్వంలో ఈ ప్రక్రియను చేపట్టారు. మండల కేంద్రాలకు కార్యదర్శులను పిలిపించుకుని పంచాయతీల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఏ రిజర్వేషన్లు ఉన్నాయని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను బుధవారం ఉదయానికి ఒక కొలిక్కి తెచ్చి సాయంత్రంలోపు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. అదే విధంగా వార్డుల రిజర్వేషన్లు కూడా చేపట్టనున్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.