గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం కోసం కసరత్తు
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:25 PM
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు ప్రారంభమైంది.
వచ్చే నెల 2తో ముగియనున్న పాలకవర్గాలు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు ప్రారంభమైంది. గజిటెడ్ హోదా ఉన్న అధికారులను నియమించాలని పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఆదేశాలు జారీ కావడంతో తదనుగుణంగా రెండు జిల్లాల్లోని పంచాయతీలకు పాలక మండళ్ల స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకానికి వివరాలు పంపాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చే శారు. ప్రకాశం జిల్లాలో 519 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 406 గ్రామ పంచాయతీలు కలిపి 925 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల వారీగా మండల స్థాయిలో ఉండే ఎంపీడీవోలు ఆ మండలంలో ఉండే గజిటెడ్ హోదా ఉన్న అధికారుల వివరాలను పంపాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయాపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.