అంతా పారదర్శకం
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:16 AM
సాగులో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలోనూ పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధిం చి అనుసరిస్తున్న విధానమే అందుకు నిద ర్శనం.
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం లబ్ధిదారుల ఎంపికకు కొత్త విధానం
జిల్లాకు రూ.4.18కోట్లు కేటాయింపు
50 శాతం సబ్సిడీపై అందజేత
జేసీ నేతృత్వంలో అధికారులతో కమిటీ
జిల్లా ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణ
పరికరాలు అందించే కంపెనీల ప్రతినిధులతో డీఏవో శ్రీనివాసరావు సమీక్ష
సాగులో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలోనూ పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధిం చి అనుసరిస్తున్న విధానమే అందుకు నిద ర్శనం. గతంలో వ్యవసాయశాఖ అధికారుల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ సాగేది. ఆ సమయంలో అధికారంలో ఏపార్టీ వారు ఉంటే వారి ప్రభావం అధికంగా ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా ఎంపిక ప్రక్రియను చేపడుతోంది. పరికరాలు అవసర మైన వారు వ్యవసాయ శాఖ రూపొందిం చిన ప్రత్యేక యాప్ లేదా పోర్టల్‌లో పేర్లను రిజిస్ట్రేషన్ (నమోదు) చేసుకుంటే వారి ఎంపికను లాటరీ ద్వారా చేయనుంది.
ఒంగోలు ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) కింద వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అందుకోసం సబ్సిడీపై రాష్ట్రానికి నిధులు ఇస్తోంది. ఆ పథకం లబ్ధిదారుల ఎంపి కను రాష్ట్రప్రభుత్వం అత్యంత పారదర్శ కంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ పథకం కింద 2025-26 సంవత్సరానికి కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను కొంత ఆలస్యంగా ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. 2024-25 సంవత్సరం చివర్లో ఈ నిధులు రావడంతో ఆ ఏడాది లబ్ధిదారుల ఎంపిక జాప్యమైంది. దీంతో 2025-26 లబ్ధిదారుల ఎంపిక కూడా ఆలస్యమైంది. ప్రస్తుత ఏడాది (2026-27) పథకం కింద రానున్న జూలైలో నిధుల విడుదలకు కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో 2025-26 లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలో పూర్తికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. తదనుగుణమైన మార్గదర్శకాలను ప్రక టించి జిల్లాల వారీ నిధుల కేటాయింపుపై స్పష్టత ఇచ్చారు.
తొమ్మిది రకాల యంత్రాలు
జిల్లాకు 2025-26 సంవత్సరానికి రూ.4.18 కోట్లు కేటాయించగా అందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. ట్రాక్టర్లు, పవర్ ట్రిల్లర్లు, విత్తనాలు, ఎరువులు ఎదపెట్టే యంత్రాలు, స్ర్పేయర్లు, పంట నూర్పిడి యంత్రాలు ఇలా సాగులో ఉపయోగించే తొమ్మిది విభాగాలకు చెందిన యంత్ర పరికరాలను ప్రభుత్వం ఈ పథకం కింద ఇవ్వనుంది. చిన్న, సన్నకారుతోపాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీపై వీటిని అందజేయ నుంది. ఇప్పటి వరకూ ఇలాంటి పథకం పొందని రైతులు యంత్రపరికరాల కోసం వ్యవసాయశాఖ ప్రకటించే యాప్ లేదా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. నాలుగైదు రోజుల్లో ఈ యాప్‌ను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. ఇంటికి ఒకరికి మాత్రమే ఇవ్వనున్నారు. అలాగే ఒక్కొక్కరికి ఒక పరికరం అయితే మొత్తం ధరలో 50 శాతం లేదా 40శాతం సబ్సిడీ ఉంటుంది.
గరిష్ఠంగా ఒకరికి రెండు..
గరిష్ఠంగా ఒక్కొక్కరు రెండు కూడా పొందే అవకాశం ఉంది. వారికి రూ.50వేల వరకు సబ్సిడీ ఇస్తారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేయించాలి. కౌలు రైతులకు కూడా అవకాశం ఇచ్చారు. జిల్లాకు కేటాయించిన రూ.4.18 కోట్ల సబ్సిడీ నిధులలో సుమారు నాల్గో వంతు మేర దాదాపు రూ.1.12 కోట్ల వరకు ట్రాక్టర్లకు కేటాయించారు. వాటిని కోరుకునే వారికి గరిష్ఠ ప్రయోజనం చేకూరనుంది. మొత్తం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణ ఉంటుందని సమాచారం.
ఎక్కువ మంది ఉంటేనే లాటరీ
జిల్లాకు కేటాయించిన యూనిట్లకు సరిపడా లబ్ధిదారుల నమోదు ఉంటే వారికి నేరుగా కేటాయించే అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ మంది ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా వ్యవసాయశాఖ, హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్త తదితరులు సభ్యులుగా కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అవసరమైతే లాటరీ విధానాన్ని అమలు చేసి లబ్ధిదారులను గుర్తిస్తుంది. అంతిమంగా ఇన్‌చార్జి మంత్రి ద్వారా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు ఇచ్చే అవకాశం ఉన్న యంత్ర పరికరాలకు సంబంధించిన కంపెనీ డీలర్లతో జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) ఎస్.శ్రీనివాసరావు మంగళవారం సమావేశం నిర్వహించారు. యంత్ర పరికరాలు అందుబాటు, వాటి ధరలు, ఇతరత్రా అంశాలపై చర్చించారు,.