సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:36 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు.
నేడు వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన
మార్కాపురంలో బహిరంగ సభ
భారీ పోలీసు బందోబస్తు
బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
కాన్వాయ్ ట్రయల్ రన్
మార్కాపురం/ పెద్దదోర్నాల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశాలు
ముఖ్యమంత్రి సభ వద్దకు వచ్చే ప్రజలు, అధికారులు, వీఐపీలకు వేరువేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రజల వాహనాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, కాశినాయన టెంపుల్ వద్ద నిలపాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారుల వాహనాలకు సాయిబాలాజీ స్కూల్‌కు ఉత్తరం వైపు పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీఐపీల వాహనాలు సాయిబాలాజీ స్కూల్‌కు దక్షిణం వైపు నిలపాల్సి ఉంటుంది.
ఫీడర్ కెనాల్ వద్ద...
రూ.456 కోట్లతో చేపట్టిన వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అందుకు కలెక్టర్ రాజాబాబు పర్యవేక్షణలో అధికారులు అంతా సిద్ధం చేశారు. శిలాఫలకం, హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. గంటవానిపల్లె నుంచి ఫీడర్ కాలువ వరకూ దాదాపు 2 కి.మీ తారురోడ్డును, రాకపోకలకు వీలుగా తీగలేరు వాగుపై బ్రిడ్జిని నిర్మించారు. దీంతో మా గ్రామానికి పండుగ వచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన ప్రాంతాన్ని బాంబుస్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. హెలికాప్టర్‌తో ట్రయిల్ రన్ నిర్వహించారు. మంగళవారం ఉన్నతాధికారులు తుది పరిశీలన చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డ్డినేటర్ పి. వెంకటేశ్, ప్రకాశం జేసీ కల్పనాకుమారి, మార్కాపురం సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు.
1,500 మందితో పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 90 మంది ఎస్సైలతోపాటు 1,162 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్‌పార్టీ పోలీసులను వినియోగిస్తున్నారు. వీరితోపాటు ఏపీఎస్పీ పోలీసులు, ఏఆర్ సిబ్బందిని కూడా కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సీఎం బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను బుధ వారం బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అక్క డి నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.