Share News

అంతా మొక్కుబడి

ABN , Publish Date - May 03 , 2026 | 02:21 AM

ఉమ్మడి జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. అజెండాలో 10 అంశాలను పొందు పర్చినా కేవలం ఆరింటికే పరిమితమైంది.

అంతా మొక్కుబడి
జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, వేదికపై ప్రకాశం, మార్కాపురం జేసీలు కల్పనాకుమారి, శ్రీనివాసులు

ప్రజా సమస్యల ప్రస్తావనే లేదు

తాగునీటి సరఫరాపై అరకొర చర్చ

మొంథా తుఫాన్‌ పరిహారంపై ప్రశ్నించిన ఎమ్మెల్సీ తూమాటి

జడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనంపై సభ్యుల ఆవేదన, ఆక్రోశం

ఇతర అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన జడ్పీ సమావేశం

ఒంగోలు కలెక్టరేట్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. అజెండాలో 10 అంశాలను పొందు పర్చినా కేవలం ఆరింటికే పరిమితమైంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయశాఖపై కొంతమేర చర్చ జరిగినప్పటికీ అది పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఏడెనిమిది మంది జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమ ప్రాంతానికి సంబంధించిన అరకొర సమస్యలను ప్రస్తావించారు. చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన శనివారం స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం 10.55కు ప్రారంభమైన మధ్యాహ్నం 1.05 గంటలకు ముగిసింది.

గౌరవ వేతనం ఇవ్వడం లేదు

ఉమ్మడి జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు గత రెండేళ్ల నుంచి కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని జడ్పీటీసీలు జాన్‌పాల్‌, తిరుపతిరెడ్డిలు ప్రశ్నించారు. ఎప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినా ప్రభుత్వానికి నివేదిస్తున్నామని చెప్తున్నారని, మీకు జీతాలు రాకపోతే ఇలాగే ఉంటారా అని ప్రశ్నించారు. వెలిగండ్ల జడ్పీటీసీ సభ్యుడు గుంటక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ జడ్పీ మూడు జిల్లాల్లో ఉంద ని, ఈనేపథ్యంలో ముఖ్యమైన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాకపోవ డం దారుణంగా ఉందన్నారు. కలెక్టర్లు రాన ప్పుడు సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మంచినీటి సమస్యపై ప్రశ్నించారు. ఎమ్మె ల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ ఎనిమిది నెలల క్రితం మొంథా తుఫాన్‌ కారణంగా పెద్దఎత్తున పంట నష్టం జరిగిందన్నారు. రైతులకు ఇంతవరకు పరిహారం, ఇన్సూరెన్స్‌ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో ప్రకాశం, మార్కాపురం జేసీలు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, జడ్పీ సీఈవో చిరంజీవి పాల్గొన్నారు.

ఈ ఏడాది వెలిగొండ నుంచి నీరు : ఎంపీ మాగుంట

ఈ ఏడాది వెలిగొండ నుంచి ప్రజ లకు సాగు, తాగునీరు అందిస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. తాగునీటి సరఫరాపై చర్చ సమమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుచూపుతో వ్యవహ రించడంతో ప్రస్తుతం చెరువులు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో నీరు ఉందన్నారు. గతేడాది వరకు వేసవి వచ్చిందంటే ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. గతనెలలో సీఎం వెలిగొండ ప్రాజెక్టును సంద ర్శించి పనులు మరింత వేగవంతం అయ్యేలా దిశానిర్దేశం చేశారన్నారు. వెలిగొండను పూర్తిచేయడం ద్వారా మార్కాపురం జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 02:21 AM