Share News

అంతా యాప్‌

ABN , Publish Date - May 21 , 2026 | 03:40 AM

ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, విక్రయాల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం యాప్‌ ద్వారా అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాలో ఖరీఫ్‌ కన్నా ఎరువుల వాడకం రబీ సీజన్‌లో కాస్తంత ఎక్కువగా ఉంటుంది.

అంతా యాప్‌

దాని ఆధారంగా ఎరువుల అమ్మకాలు

బ్లాక్‌ మార్కెట్‌, అక్రమ విక్రయాలకు చెక్‌

ఖరీఫ్‌కు 57,468 మెట్రిక్‌ టన్నులు అవసరం

వ్యవసాయశాఖ అంచనా

ఇప్పటికే 36,954 మెట్రిక్‌ టన్నులు సిద్ధం

4,541 మెట్రిక్‌ టన్నుల విక్రయాలు

పంపిణీకి సిద్ధంగా పచ్చిరొట్ట విత్తనాలు

50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేత

ఈ ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువుల సమస్య ఏర్పడింది. ప్రత్యేకించి యూరియా కోసం రైతులు అగచాట్లు పడ్డారు. రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. కొన్నిచోట్ల బ్లాక్‌ మార్కెట్‌ నడిచింది. ఈనేపథ్యంలో రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో అలాంటి సమస్యలు రాకుండా వ్యవసాయశాఖ ఉన్నతాధికా రులు ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు చేపట్టారు. పక్కదారి పట్టకుండా ఉండేందుకు యాప్‌ ద్వారా విక్రయాలకు ఏర్పాట్లు చేశారు. తదనుగుణంగా జిల్లాలోనూ ఆ శాఖ అధికారులు అప్రమత్తమై ముందస్తుగా ఎరువులను సిద్ధం చేశారు.

ఒంగోలు మే 20 (ఆంరఽధజ్యోతి) : ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, విక్రయాల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం యాప్‌ ద్వారా అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాలో ఖరీఫ్‌ కన్నా ఎరువుల వాడకం రబీ సీజన్‌లో కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 57,468 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో సుమారు సగం మేర కాంప్లెక్స్‌ ఎరువులు ఉంటాయి. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన 57,468 మెట్రిక్‌ టన్నుల ఎరువుల్లో 41,195 మెట్రిక్‌ టన్నులు సిద్ధం చేశారు. అందులో ఇప్పటివరకు 4,561 మెట్రిక్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. మిగిలిన 36,954 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వివిధ ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రభుత్వ సంస్థలు, గ్రామస్థాయిలో ఉండే వ్యవసాయశాఖకు సంబంధించిన రైతు సేవా కేంద్రాల్లో నిల్వ ఉంచారు. గతంలో వివిధ రూపాలలో సేకరించిన సమాచారం ఆధారంగా ఆ డేటాను క్రోడీకరించి ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఆ యాప్‌ను ఎరువుల విక్రయదారులు ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉన్నారు. ఎరువుల కోసం వచ్చిన రైతుల పేరును అందులో నమోదు చేస్తే ఆయనకు సంబంధించిన భూమి, పంటల సాగు వివరాలు వస్తాయి. తదనుగుణంగా వారికి ఎరువులు విక్రయించేలా ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఇవి విజయవంతం అయితే భవిష్యత్‌లో పూర్తిగా ఈ విధానాన్ని ఎరువుల విక్రయాలలో అమలు చేయనున్నారు. అప్పటి వరకు గతంలో వలే కూడా ఎరువులు ఇవ్వనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

యూరియాపైనే దృష్టి

తరచూ కొరత వచ్చే యూరియా విషయం లోనూ ఈసారి ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సీజన్‌ అవసరాలలో భాగంగా ఇప్పటికే 10,410 మెట్రిక్‌ టన్నుల యూరియాను తెప్పించి నిల్వ చేశారు. దీంతోపాటు 3,091 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, సుమారు 19,821 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను సిద్ధంగా ఉంచారు. ఎరువుల అక్రమ కొనుగోళ్లు, పక్కదారి పట్టడాన్ని నివారించడం కోసం ఈ సీజన్‌ నుంచి విక్రయాలను యాప్‌లో నమోదుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రైతుల పేర్లు, భూమి వివరాలు, గత ఏడాది సాగు చేసిన పంట వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.

50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. భూమిలో సారం, సేంద్రియ శాతం పెంపు ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గింపు లక్ష్యంగా పచ్చిరొట్ట పైర్ల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందుకోసం 50శాతం సబ్సిడీపై జనుము, జీలుగ, పిల్లిపెసర తదితర పచ్చిరొట్ట ఎరువులను రైతులకు ఇవ్వనున్నారు. ఈ సీజన్‌కు 4,253 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాకు కేటాయించారు. అందులో 2,486 క్వింటాళ్లు జనుము ఉండగా 947 క్వింటాళ్లు జీలుగ, 820 క్వింటాళ్లు పిల్లిపెసర సిద్ధం చేశారు. రైతులు స్థానిక వ్యవసాయశాఖ సిబ్బందిని సంప్రదించి సబ్సిడీ విత్తనాలు పొందాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు సూచించారు. ఆ పంటల సాగు ద్వారా భూ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.

Updated Date - May 21 , 2026 | 03:40 AM