అన్నీ ఏ-గ్రేడ్‌లోనే..
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:56 AM
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా రూపొందించిన మార్కుల జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలూ ఏ-గ్రేడ్‌లోనే నిలిచాయి. అయితే 90కు మించి మార్కులు వచ్చిన జాబితాలో జిల్లాలో ఒక్కనియోజకవర్గానికి కూడా స్థానం దక్కలేదు. 75కిపైగా మార్కులు వచ్చిన వాటిలో వరుసగా కొండపి, కందుకూరు, ఒంగోలు నియోజకవర్గాలు ఉన్నాయి.
టాప్‌లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు
కొండపి, కందుకూరు, ఒంగోలుకు 75కుపైగా మార్కులు
సర్వేల ఆధారంగా ప్రకటించిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా రూపొందించిన మార్కుల జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలూ ఏ-గ్రేడ్‌లోనే నిలిచాయి. అయితే 90కు మించి మార్కులు వచ్చిన జాబితాలో జిల్లాలో ఒక్కనియోజకవర్గానికి కూడా స్థానం దక్కలేదు. 75కిపైగా మార్కులు వచ్చిన వాటిలో వరుసగా కొండపి, కందుకూరు, ఒంగోలు నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఆయా నియోజ కవర్గాలలో శాసనసభ్యులు, ఇన్‌చార్జిల పనితీరులపై ఫోన్ సర్వేలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తదనుగుణంగా ఆయా అంశాలవారీ నివేదికలు రూపొంది స్తుంటారు. ఆ మేరకు మూడు మాసాలకొకసారి జరిగే మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశాల్లో వాటిని ప్రకటిస్తారు. తాజా సమాచారాన్ని సోమవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం విడుదల చేసింది. అదే సమయంలో నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమ ఫలాల అమ లుపై ఒక నివేదికను రూపొందించింది. అందులో ఏ-గ్రేడ్‌లో మొత్తం 151 అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానం దక్కింది. వాటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలూ ఉన్నట్లు సమాచారం. 100కు 90కి పైగా మార్కులు వచ్చిన స్థానాలలో మాత్రం జిల్లాలో ఒక్క నియోజకవర్గానికి కూడా చోటు దక్కలేదు. నూటికి 75 నుంచి 80లోపు మార్కులు లభించిన స్థానాలలో మాత్రం మూడింటికి చోటు లభించింది. అందులో కొండపి నియోజకవర్గం 79 మార్కులతో అగ్రస్థానంలో ఉంది. కందుకూరు 78 మార్కులతో రెండో స్థానంలో, 77 మార్కులతో ఒంగోలు నియోజకవర్గం మూడో స్థానంలో నిలిచాయి. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఏ గ్రేడ్‌లు పొందినప్పటికీ 70 మార్కులలోపు ఉన్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎమ్మెల్యేల ప్రత్యేక పనితీరు, వారు ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎలా ఉన్నారు, అవినీతి వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనే అంశాల ఆధారంగా రూపొందించిన మరో కీలక నివేదికను ప్రభుత్వం బయటపెట్టకపోవడం గమనార్హం.