ఒక్కొక్కరిది ఒక్కో గాథ!
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:46 PM
మార్కాపురం మండలం రాయవరం వద్ద రోడ్డు ప్రమాదంలో పలు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి బాధాకరంగా ఉన్నాయి. కొనకనమిట్ల మండలం పెదారికట్ల ఎస్సీకాలనీకి చెందిన అంబటి అనిల్ (26), అతని కుమారుడు లియోన్ (5 నెలలు) మృతి చెందారు. అనిల్ భార్య సౌజన్య ప్రాణాలతో బయటపడ్డారు.
బస్సు ప్రమాద మృతుల పరిస్థితి ఇదీ..
అన్నప్రాసన కోసం వస్తూ చిన్నారితోసహా తండ్రి మృతి
ప్రాణాలతో బయటపడిన తల్లి
కొనకనమిట్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం మండలం రాయవరం వద్ద రోడ్డు ప్రమాదంలో పలు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి బాధాకరంగా ఉన్నాయి. కొనకనమిట్ల మండలం పెదారికట్ల ఎస్సీకాలనీకి చెందిన అంబటి అనిల్ (26), అతని కుమారుడు లియోన్ (5 నెలలు) మృతి చెందారు. అనిల్ భార్య సౌజన్య ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే... అనిల్, సౌజన్యకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఐదు నెలల క్రితం వారికి బాబు పుట్టాడు. తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అనిల్... భార్య, కొడుకుతో అక్కడే ఉంటున్నాడు. స్వగ్రామంలో బంధుమిత్రుల సమక్షంలో అన్నప్రాసన చేయాలని బుధవారం రాత్రి కరీంనగర్‌లో ప్రైవేటు బస్సు ఎక్కారు. మరో గంటలో గమ్యానికి చేరాల్సి ఉంది. ఈలోపు బస్సు ప్రమాదానికి గురై అగ్నికీలలు వ్యాపించాయి. వెంటనే అనిల్ బస్సు అద్దం పగులగొట్టి భార్యను కిందికి నెట్టాడు. పసిబిడ్డను ఎత్తుకొని తానూ దూకితే బిడ్డకు ఆపాయం కలుగుతుందని భావించి గేటు ద్వారా బయటకు వచ్చేందుకు క్యాబిన్ వద్దకు చేరుకున్నాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అనిల్, లియోన్ సజీవదహనమయ్యారు.
తల్లీకుమార్తె మృతి
పొదిలి : మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో మండలానికి చెందిన తల్లీకుమార్తె మృతి చెందారు. మండలంలోని ఉన్నగురవాయపాలెంకు చెందిన ప్రభావతి బతుకుదెరువు కోసం తెలంగాణలోని జగిత్యాలలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంత ఊరిలో శనివారం జరిగే ముసి ఆంజనేయస్వామి తిరునాళ్ల కోసం ఇటీవల వచ్చారు. జగిత్యాలలో ఉంటున్న అద్దె ఇంటి యజమాని ఖాళీ చేయమనడంతో తిరిగి వెళ్లి ఖాళీ చేసి బుధవారం తిరుగుప్రయాణం కాగా మృత్యువు కబళించింది. ఈప్రమాదంలో ప్రభావతి (36), చైత్ర (6) సజీవదహనమయ్యారు. ప్రభావతికి నెల్లూరు జిల్లా కొండపల్లి మండలంలోని యర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులుతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి వెంకటనాగ కల్యాణ్, వెంకట నరేంద్ర ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు లేకపోవడంతో చెల్లెలైన మల్లేశ్వరి కుమార్తె గోపిదేశి చైత్రను పెంచుకుంటోంది. బస్సు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు.
శ్రీరామనవమికి స్వగ్రామానికి వస్తూ..
కనిగిరి : పునుగోడు గ్రామానికి చెందిన దేవెండ్ల రామయ్య (50) తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల బేల్దారి పనులు చేసుకుంటూ కోరుట్లలో ఉండిపోయాడు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. స్వగ్రామం పునుగోడు అంటే ఆయనకు మమకారం. ప్రతి శ్రీరామనవమికి పునుగోడుకు అన్నదమ్ములంతా వచ్చి ఉత్సవాలు నిర్వహించి పాల్గొంటారు. ఇదే క్రమంలో రామయ్య బుధవారం రాత్రి కోరుట్ల నుంచి కనిగిరికి బయల్దేరాడు. మార్కాపురం వద్దకు వచ్చే సరికి బస్సు దగ్ధమై మృతి చెందాడు.
అంకభూపాలపురానికి చెందిన మహిళ మృతి
అదే గ్రామానికి చెందిన మనెమ్మ, రోహన్‌కు తీవ్ర గాయాలు
వలేటివారిపాలెం, మార్చి 26 (ఆంద్రజ్యోతి) : మార్కాపురం సమీపంలోని రాయవరం గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రయివేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదంలో వలేటివారిపాలెం మండలంలోని అంకభూపాలపురం గ్రామానికి చెందిన బండారు పద్మ (50) మృతి చెందగా అదే గ్రామానికి చెందిన బత్తుల మనెమ్మ, బండారు రోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణా రాష్ట్రం జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వస్తున్న హరికృష్ణ ప్రయివేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో అగ్నికి ఆహుతై పలువురు సజీవదహనం అయ్యారు. బస్ రాయవరం వద్ద మూలమలుపులో ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంలో మృతి చెందిన పద్మను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమ్మితం తరలించారు. తీవ్రంగా గాయపడిన బత్తుల మనెమ్మకు ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. బండారు రోహన్‌కు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన పద్మ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.