Share News

పాఠాలు చెప్పకపోయినా పేపర్లు దిద్దండి

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:28 AM

ఒంగోలులో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి జవా బుపత్రాల మూల్యాంకనానికి ఉపాధ్యా యుల నియామకంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఆటోమేషన్‌ విధానంలో చేపట్టిన మూల్యాంకన విధుల కేటాయింపుల్లో భారీగా తప్పులు దొర్లాయి.

పాఠాలు చెప్పకపోయినా పేపర్లు దిద్దండి

చిత్రవిచిత్రంగా టెన్త్‌ ‘స్పాట్‌’ విధులు

విస్తుపోతున్న టీచర్లు

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 4 (ఆంధ్ర జ్యోతి) : ఒంగోలులో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి జవా బుపత్రాల మూల్యాంకనానికి ఉపాధ్యా యుల నియామకంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఆటోమేషన్‌ విధానంలో చేపట్టిన మూల్యాంకన విధుల కేటాయింపుల్లో భారీగా తప్పులు దొర్లాయి. పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించని ఉపాధ్యాయులను నియమించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, అంతా పారదర్శకంగా, కచ్చితంగా ఉంటుందని నమ్మబలికిన పాఠశాల విద్యాశాఖ స్పాట్‌ నియామ కాల్లోనే పప్పులో కాలేసింది. విద్యార్థులకు పాఠాలు బోధించని వారిని పేపర్లు దిద్దేందుకు నియమించడం పట్ల విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం మూడు సంవత్సరాలు పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు బోధిం చిన వారికే మూల్యాంకనం విధులు అప్పగించాలి. అయితే అసలు బోధిం చని వారిని నియమించారు. తాము పదో తరగతి విద్యార్థులకు బోధించడం లేదని చెప్పినా అవేమీ పట్టించుకోలేదు.

అప్‌గ్రే డ్‌ హైస్కూలు టీచర్లకు స్పాట్‌ విధులు

ఉమ్మడి జిల్లాలో గత ఏడాది జడ్పీ హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాల ల్లో పనిచేస్తున్న టీచర్లను కూడా ప్రస్తుత స్పాట్‌ వాల్యుయేషన్‌కు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అప్‌గ్రేడ్‌ హైస్కూళ్లలో అసలు పదో తరగతి లేదు. గతేడాది 9వతరగతి రాగా వచ్చే విద్యా సంవత్సరంలో (2026-27) పదో తరగతి మొదటి బోధన ప్రారంభంకానుంది. అయినప్పటికీ అక్కడి టీచర్లను కూడా మూల్యాంకనానికి నియమించారు. వారు ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ‘ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ వాల్యువేషన్‌ ఇస్తారు కనుక వాటిని చదివి పేపర్లు దిద్దండి.. సర్దుకుపోండి’ అని చెప్తుండటం పట్ల టీచర్లు ఆందోళన చెందుతున్నారు.

స్పెషల్‌ అసిస్టెంట్ల నియామకంలోనూ..

స్పెషల్‌ అసిస్టెంట్ల మూల్యాంకనంలోనూ తప్పులు దొర్లాయి. ఈ నెల 6 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ పాఠశాలల్లో ఒక్క టీచర్‌ కూడా లేకుండా అందరినీ మూల్యాంకన విధులకు నియమించారు. కొన్ని హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతులకు ముగ్గురు టీచర్లు ఉండగా వారందరినీ స్పెషల్‌ అసిస్టెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒక పాఠశాలలో ఐదుగురు టీచర్లు పనిచేస్తుండగా ముగ్గురిని స్పాట్‌కు నియమించారు. మరొకరు అధికారిక విధుల్లో ఉండగా పాఠశాలలో కేవలం ఒక టీచర్‌ మాత్రమే మిగిలారు. స్పాట్‌కు స్పెషల్‌ అసిస్టెంట్ల కొరత ఏర్పడింది. 267 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు అవసరం కాగా మొదట 204 మందినే నియమించారు. వీరిలో 168 మంది మత్రమే శనివారం శిక్షణ తరగతులకు హాజరయ్యారు. అంటే సుమారు మరో 100మంది స్పెషల్‌ అసిస్టెంట్ల అవసరం ఉంది. అదనంగా అవసరమైన వంద మంది స్పెషల్‌ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ (డీజీఈ) కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

Updated Date - Apr 05 , 2026 | 02:28 AM