Share News

జిల్లా మారినా.. మార్పులేని పర్యవేక్షణ

ABN , Publish Date - Jun 07 , 2026 | 02:39 AM

జిల్లాల పునర్విభజనతో అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరి ఐదు నెలలు దాటింది. ఇంకా పలు శాఖల పర్యవేక్షణ, పరిధి మాత్రం పాత జిల్లాలోనే కొనసాగుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు అయోమయా నికి గురవుతున్నారు.

జిల్లా మారినా.. మార్పులేని పర్యవేక్షణ
గుంటుపల్లి పీహెచ్‌సీపై మార్చని బాపట్ల జిల్లా పేరు

అక్కడి అధికారులే నిర్వహణ

క్షేత్రస్థాయి సిబ్బంది అయోమయం

అద్దంకి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాల పునర్విభజనతో అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరి ఐదు నెలలు దాటింది. ఇంకా పలు శాఖల పర్యవేక్షణ, పరిధి మాత్రం పాత జిల్లాలోనే కొనసాగుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు అయోమయా నికి గురవుతున్నారు. పలు సందర్భాలలో పర్యవే క్షణ రెండు జిల్లాల అధికారులు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, సబ్‌ట్రెజరీ కార్యాలయ పర్యవేక్షణ పూర్తిగా బాపట్ల జిల్లా అధికారుల పరిధిలోనే కొనసాగుతోంది. విద్యుత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్య, వ్యవసాయ శాఖలను రెండు జిల్లాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం అద్దంకిలో జరిగిన స్పెషల్‌ పీజీఆర్‌ఎస్‌కు అటు బాపట్ల డీఈవో శ్రీనివాస్‌, ఇటు ప్రకాశం డీఈవో రేణుక హాజరయ్యారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇద్దరు జిల్లా అధికారులు కలిసి పరిశీలించారు. ఇటీవల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశాన్ని బాపట్ల జిల్లా అధికారులు అద్దంకిలో నిర్వహించారు. విద్యుత్‌ శాఖ విషయానికి వస్తే అద్దంకి డివిజన్‌కు సంబంధించిన పర్యవేక్షణ రెండు జిల్లాల అధికారులు చూస్తున్నారు. బాపట్ల జిల్లాలోని మార్టూరు, యద్దనపూడి మండలాలు అద్దంకి విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోనే కొనసాగుతున్నాయి. వ్యవసాయశాఖలో సంతమాగులూరు, బల్లికురవ, పంగులూరు మండలాలు మార్టూరు ఏడీఏ పరిధిలో ఉండగా, ఇంకా అధికారికంగా అద్దంకి ఏడీఏ పరిదిలో కలుపుతున్నట్లు స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. అనధికార పర్యవేక్షణ మాత్రం అద్దంకి ఏడీఏ పరిధిలోనే సాగుతున్నది. ఇలా పలుశాఖల పరిధిని విభజించకుండా రెండు జిల్లాల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుండటం ప్రజలను ఒకింత తికమకకు గురిచేస్తోంది. జిల్లా మారి ఐదు నెలలు గడిచినా ఇంకా పలు గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలపై బోర్డులు బాపట్ల జిల్లాగానే దర్శనం ఇస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లా సరిహద్దులలో స్వాగత బోర్డులు కూడా బాపట్ల జిల్లాగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని శాఖల పర్యవేక్షణ పూర్తిగా ప్రకాశం జిల్లా పరిధిలో జరిగేలా చర్యలు చేపట్టాలని, జిల్లా సరిహద్దులలో ఉన్న స్వాగత బోర్డులలో కూడా మార్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 02:39 AM