ఆలస్యమైనా.. అన్నీ రావాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:38 AM
పొగాకు వేలం ప్రారంభం కొంత ఆలస్యమైనా తొలి నుంచి అన్ని కంపెనీల బయ్యర్లు పాల్గొనాలని, పరిస్థితులకు అనుగుణంగా ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని అత్యధిక శాతం మంది పొగాకు రైతులు అభిప్రాయప డుతున్నారు.
అన్ని కంపెనీల బయ్యర్లు వేలంలో పాల్గొనాలి
వచ్చే నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి
రైతు కమిటీ ప్రతినిధుల డిమాండ్
ఈసీజన్ వేలం ప్రక్రియపై అధికారుల అభిప్రాయ సేకరణ
కర్ణాటకలో కుదుటపడని మార్కెట్
ఆ ప్రభావంతోనే ఇక్కడ వేలం జాప్యం
ఒంగోలు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : పొగాకు వేలం ప్రారంభం కొంత ఆలస్యమైనా తొలి నుంచి అన్ని కంపెనీల బయ్యర్లు పాల్గొనాలని, పరిస్థితులకు అనుగుణంగా ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని అత్యధిక శాతం మంది పొగాకు రైతులు అభిప్రాయప డుతున్నారు. అదే విషయాన్ని బోర్డు అధికా రులు రైతు కమిటీలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో స్పష్టంగా చెప్తున్నారు. మూడురోజుల క్రితం ఈ అంశంపై దక్షిణాది రీజియన్‌లోని వేలంకేంద్రాల ప్రతినిధులతో పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణగోపాల్, ఆర్‌ఎం శీలం రామారావు నిర్వహించిన సమావేశంలో తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమైన వేలం కేంద్రాల వారీ సమావేశాల్లోనూ రైతులంతా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. గతేడాది మార్చి 10న దక్షిణాది వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించగా ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిగరెట్లపై కేంద్రం పన్నులు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక మార్కెట్‌లో ధరలు తగ్గడంతోపాటు కొనుగోళ్లు మందగించాయి. వారం పదిరోజులుగా అక్కడ మార్కెట్ గందరగోళంలో పడింది. ఆ ప్రభావంతో ఇక్కడ వేలం ప్రారంభం జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది.
ఎట్టకేలకు కదిలిన అధికారులు
కర్ణాట పరిణామాలపై ఇక్కడి రైతుల్లో ఆందోళన నెలకొనడంతోపాటు జోరుగా అనధికారిక కొనుగోళ్లు సాగుతుండటం, బోర్డు వైపు నుంచి చర్యలు లేని వ్యవహారంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించడంతో బోర్డు అధికారులు కదిలారు. రైతులతో ప్రస్తుతం సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం రీజియన్ స్థాయి ఈ సమావేశం జరగ్గా సోమవారం నుంచి గురువారం వరకు దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఒంగోలు-2 వేలం కేంద్రంలో రైతు కమిటీతో వేలం కేంద్ర అధికారి జె.తులసి భేటీ అయ్యారు. కొనుగోళ్లపై వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. కొందరు గతేడాది వలే మార్చి 10 నుంచి ప్రారంభించాలని కోరారు. అత్యధికులు ప్రస్తుత కర్ణాటక పరిస్థితులను ప్రస్తావిస్తూ వేలం కొంత ఆలస్యంగా ప్రారంభించినా తొలి నుంచి అన్ని కంపెనీల బయ్యర్లు పాల్గొనేలా అలాగే చురుకుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అందుకోసం అవసరమైతే గతేడాది కన్నా పక్షం ఆలస్యంగా మార్చి 25 నుంచి వేలం ప్రారంభించినా అభ్యంతరం లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇతర వేలం కేంద్రాల్లోనూ ఇలాంటి అభిప్రాయాన్ని అత్యధిక శాతం మంది రైతులు బోర్డు అధికారులకు స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కుదటపడని కర్ణాటక మార్కెట్
కర్ణాటక మార్కెట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితి ఇంకా కుదటపడలేదు. సోమవారం కూడా అక్కడ కొన్ని వేలం కేంద్రాల్లో మాత్రమే వేలం కొనసాగింది. మరికొన్నింటిలో ఆగినట్లు సమాచారం. అక్కడ ఇంకా 40శాతం పంట రైతుల వద్ద నిల్వ ఉంది. అది కొనుగోలు జరగకుండా ఇక్కడ వేలం ప్రారంభించినా ప్రయోజనం ఉండదన్న భావన ఇక్కడి రైతులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే గతేడాది కన్నా పక్షం రోజులు ఆలస్యంగా ప్రారంభించిన పర్వాలేదని అయితే తొలి నుంచి అన్ని కంపెనీల వారు హాజరై కొనుగోళ్లు చేసేలా చూడాలని కోరుతున్నట్లు రైతు నాయకులు చెప్తున్నారు.