తుఫాన్ కూడా నిరాశపరిచే!
ABN , Publish Date - Oct 29 , 2026 | 02:45 AM
తుఫాన్ ప్రభావంతోనైనా వర్షం కురవకపోతుందా అని ఎదురుచూసిన రైతులకు ఆర్నబ్ నిరాశనే మిగిల్చింది. సాధారణంగా తుఫాన్‌లు అంటే ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తారు. దాని వల్ల కురిసే భారీ వర్షాలు, పెద్దఎత్తున వీచే గాలులతో పంటలు, విద్యుత్, రోడ్లు, ఇతరత్రా అనేక మౌలిక సదుపా యాలకు తీవ్రనష్టం వాటిల్లుతుంది.
వర్షం కోసం ఎదురుచూసిన రైతులు
చిరు జల్లులకే పరిమితమైన ఆర్నబ్
ఒంగోలు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్ ప్రభావంతోనైనా వర్షం కురవకపోతుందా అని ఎదురుచూసిన రైతులకు ఆర్నబ్ నిరాశనే మిగిల్చింది. సాధారణంగా తుఫాన్‌లు అంటే ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తారు. దాని వల్ల కురిసే భారీ వర్షాలు, పెద్దఎత్తున వీచే గాలులతో పంటలు, విద్యుత్, రోడ్లు, ఇతరత్రా అనేక మౌలిక సదుపా యాలకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అందువల్ల తుఫాన్‌ల ప్రభావం తమ ప్రాంతంలో లేకుండా ఉంటే బాగుండు అని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటుంటారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఐదునెలలుగా తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్‌ను కరువు కాటేసింది. రబీలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖా తంలో ఆర్నబ్ తుఫాన్ ఏర్పడింది. ప్రధానంగా ఉత్తరాంధ్రపై అది ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. పొరు గున ఉన్న బాపట్ల సమీపంలోనైనా తీరం దాటే అవకాశం ఉందని సమా చారం కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వ సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ప్రత్యేకించి తీర ప్రాంత మండలాల్లో ఆదివారం నుంచి పలు ముందస్తు చర్యలను చేపట్టారు. దీంతో తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా లేకపోయినా కనీసం ఒక మోస్తరు వర్షమైనా కురిసి సాగుకు ఉపయోగపడుతుందని రైతులు భావించారు. అందుకు అనుగుణంగానే సోమ, మంగళవారాల్లో జిల్లాలో ఆకాశం మేఘావృత్తమై మబ్బులు పట్టి చల్లటి గాలులు వీచాయి, దీంతో కనీస వర్షం పడుతుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు. అయితే మబ్బులు పట్టడం తప్ప జల్లులు పడిన దాఖలాలు జిల్లాలో లేవు. బుధవారం మధ్యాహ్నం తుఫాన్ తీరం దాటిన సమయంలో కొద్దిపాటి జల్లులు పడినా కాసేపటికి తెరపి ఇచ్చింది. మొత్తం మీద తుఫాన్ వల్ల అయినా వర్షం కురుస్తుందని, పంటలకు ఉపయుక్తం అవుతుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.