అభివృద్ధి వేళ.. ఈవో సస్పెన్షన్
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:49 AM
శింగరకొండ ఆలయ మహా అభివృద్ధికి అడుగులు పడుతున్న సమయంలో ఈవో తిమ్మానాయుడుపై సస్పెన్షన్ వేటు పడటం చర్చనీయాంశమైంది. శింగరకొండలో అభివృద్ధి సుమారు 110 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. వందేళ్లలో జరిగింది ఒక ఎత్తైతే, గత దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తు. వీటన్నింటికీ మించి రాబోయే రెండు, మూడేళ్లలో జరగబోయే అభివృద్ధి వచ్చే వందేళ్ల వరకు చిరస్థాయిగా నిలిచే అవకాశం ఉంది.
చర్చనీయాంశంగా మారిన శింగరకొండ వ్యవహారం
పది మంది రెగ్యులర్ సిబ్బంది ఉండాల్సిన చోట ఒకే ఒక్కడు
అంతా అవుట్ సోర్సింగ్ వారే!
అద్దంకి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ ఆలయ మహా అభివృద్ధికి అడుగులు పడుతున్న సమయంలో ఈవో తిమ్మానాయుడుపై సస్పెన్షన్ వేటు పడటం చర్చనీయాంశమైంది. శింగరకొండలో అభివృద్ధి సుమారు 110 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. వందేళ్లలో జరిగింది ఒక ఎత్తైతే, గత దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తు. వీటన్నింటికీ మించి రాబోయే రెండు, మూడేళ్లలో జరగబోయే అభివృద్ధి వచ్చే వందేళ్ల వరకు చిరస్థాయిగా నిలిచే అవకాశం ఉంది. గత ఐదారేళ్లలో సుమారు రూ.10 కోట్లతో దేవాలయ రాతి ముఖమండపంతోపాటు పలు శాశ్వత భవనాల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఉన్న రాజగోపురాల స్థానంలో కొత్తవి నిర్మాణం, ప్రాకారాలను రాతితో నిర్మించే ప్రణాళికలు తయారయ్యాయి. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో పూర్తిగా దాతల సహకారంతో నాలుగు రాజగోపురాలు, ప్రాకార మండపాల నిర్మాణానికి అంతా సిద్ధమైంది. నాలుగు రాజగోపురాల నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. మరో పక్షంరోజుల్లో పనులు ప్రారంభమవుతాయనుకుంటున్న తరుణంలో ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ తిమ్మానాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. తిమ్మానాయుడు గతంలో ఇక్కడ పనిచేసి వైసీపీ పెద్దల ఆగ్రహానికి గురై బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా బదిలీపై వచ్చారు. గతంలో పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలు కలిసి రావడంతో పలువురు దాతలను సంప్రదించి భారీ కార్యక్రమాలు నిర్వహించారు. మారుతీభవన్, టీటీడీ కల్యాణ మండపం, పరిపాలనా భవనం, పోటు గది, అన్నదాన భవనాలను ఆఽధునికీకరించేందుకు దాతల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించారు. ఆ నిధుల వినియోగంలో అన్నీ తానై నిర్వహించిన ఈవోపై దాతల నుంచి ఎలాంటి విమర్శలు లేకపోయినప్పటికీ దేవదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి మాత్రం పలు విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్ సమయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివరణ కూడా కోరినట్టు సమాచారం. ఈక్రమంలో శనివారం దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన సమయంలో ఈవో తిమ్మానాయుడు అందుబాటులో లేకపోవటంతో అప్పటికే ఉన్న ఫిర్యాదులకు బలం చేకూరినట్లయింది. కమిషనర్ తనిఖీ సమయంలో సిబ్బంది ఒకింత తడబాటుతో అడిగిన పత్రాలు అందజేయలేదని తెలుస్తోంది. శింగరకొండ దేవాలయ కార్యాలయంలో విధులు, పర్యవేక్షణ నిర్వహించేందుకు పదిమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నారు. మిగిలిన అందరూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అత్యఽధిక శాతం ప్రభుత్వం మారినప్పుడల్లా మారిపోతున్నారు. దీనికి తోడు రోజంతా విధులు నిర్వహించినా నెలకు రూ.12వేలకు మించి ఇస్తున్న దాఖలాలు లేవు. దీంతో పలువురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవకాశం దొరికినప్పుడల్లా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విషయం బయటపడితే ఉద్యోగంలో నుంచి తీసివేయడం మినహా రికవరీ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు సమాచారం. కమిషనర్ తనిఖీలో కూడా ఈ విషయం తేటతెల్లం అయినట్లు తెలుస్తుంది. దీనికితోడు ఈవోగా తిమ్మానాయుడు ముక్కుసూటితనంగా వ్యవహరిస్తుండటం కూడా ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణంగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో రాజగోపురాలు, ప్రాకార మండపాల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయనుకుంటున్న తరుణంలో ఈవో తిమ్మానాయుడు సస్పెన్షన్‌తో పనులు ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందా, లేక ప్రయత్నాలు ఫలించి వెంటనే విధులలో చేరతారా అన్న చర్చ జరుగుతుంది. దేవదాయశాఖలో ఏదైనా సాధ్యమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఇన్‌చార్జి ఈవోగా చంద్రశేఖర్
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ఇన్‌చార్జ్ ఈవో, అసిస్టెంట్ కమిషనర్‌గా చంద్రశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేస్తున్న తిమ్మానాయుడు సస్పెన్షన్‌కు గుర య్యారు. శనివారం దేవాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ రామచంద్రమోహన్ ఆదివారం తిమ్మానాయుడును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కోటప్పకొండ ఈవోగా ఉన్న దాసరి చంద్రశేఖర్‌ను ఇన్‌చార్జ్ ఈవోగా నియమించారు. ఆయన సోమవారం బాఽధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరి సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.