Share News

ఉత్సాహంగా తేరాతేజీ

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:03 AM

కంభం చెరువు కట్టపై తేరాతేజీ (గరికతొక్కుడు) పండుగను ముస్లింలు సోమవారం వైభవంగా నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం, మార్కాపురం జిల్లాల నుంచి 3వేల మందికిపైగా తరలివచ్చారు.

ఉత్సాహంగా తేరాతేజీ
తేరాతేజీకి హాజరైన ముస్లింలతో సందడిగా ఉన్న కంభం చెరువు కట్ట (ఇన్‌సెట్‌లో) పెళ్లినాటి దండలను నీటిలో వదులుతున్న నూతన దంపతులు

కంభం చెరువుకట్టపై కోలాహలం

తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ముస్లింలు

కంభం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : కంభం చెరువు కట్టపై తేరాతేజీ (గరికతొక్కుడు) పండుగను ముస్లింలు సోమవారం వైభవంగా నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం, మార్కాపురం జిల్లాల నుంచి 3వేల మందికిపైగా తరలివచ్చారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉభయ తెలుగు రాష్ర్టాలలో ఒక్క కంభంలోనే ఏటా ఈ పండుగను చేస్తారు. తేరాతేజీని చేదు నెలగా భావించి కొత్తగా పెళ్లయిన ముస్లిం దంపతులు 13 రోజులపాటు దూరం గా ఉంటారు. పుట్టింటికి చేరిన నూతన వధువుకు వరుడు ముఖం కూడా చూపడు. 13వ రోజు ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశానికి వెళ్తారు. ఈ సందర్భంగా బంధువులు, మిత్రులు అంతా ఒక చోటకు చేరతారు. అక్కడ అందరూ సరదాగా గడుపుతారు. ఈ పండుగను సోమవారం కంభం చెరువు కట్టపై నిర్వహించారు. ఈసందర్భంగా నూతన దంపతులు పెళ్లినాటి దండలను చెరువులో వదిలారు. అనంతరం ప్రార్థనలు చేశారు.

కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పోలీసులు

తేరాతేజీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కంభం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి ఆఽధ్వర్యంలో కంభం, అర్ధవీడు, బేస్తవారపేట మండలాల పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువు కట్టపైకి వచ్చే వారి కోసం ఉచిత మంచినీటి సౌకర్యం కల్పించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్‌ జాం కాకుండా 100 మీటర్లకు ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేశారు. చెరువులో నీరు ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. బోట్లను ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 28 , 2026 | 03:03 AM